‘మరో జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం ఇది’

Saamna Compares Amritsar Accident To Jallianwala bagh Incident - Sakshi

శివసేన పత్రిక సామ్నాలో కథనం

ముంబై : అమృత్‌సర్‌ రైలు ప్రమాదాన్ని జలియన్‌వాలా బాగ్‌ ఉదంతంతో పోలుస్తూ శివసేన తన పత్రిక సామ్నాలో కథనం వెలువరించింది. బ్రిటిషర్ల చేతిలో జలియన్‌ వాలా బాగ్‌లో అమాయక ప్రజల మీద ఊచకోత జరిగితే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారతీయులు చీమల్లా చచ్చిపోతున్నారంటూ ఘాటుగా విమర్శించింది. విజయదశమి వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రావణ దహనాన్ని వీక్షిస్తున్న వందలాది మంది రైల్వే ట్రాక్‌పైకి రావడంతో రైలు ఢీకొని 61 మంది మరణించగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే ఈ పెను ప్రమాదం సంభవించిందని శివసేన విమర్శించింది. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రమాదం జరిగిన పదహారు గంటల తర్వాత ఘటనాస్థలికి చేరుకోవడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతీసారి ఓ నూతన రైల్వేశాఖా మంత్రి మనకు దర్శనమిస్తారంటూ ఎద్దేవా చేసింది.

నాడు డయ్యర్‌ సృష్టించిన నరమేధం..
భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన ఘటనగా జలియన్ వాలాబాగ్ నరమేధం నిలిచింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్‌లో ఏప్రిల్ 13, 1919న భారీ సంఖ్యలో ప్రజలు సమావేశమయ్యారు. ఆంగ్లేయుల అరాచకాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలు వినేందుకు, రౌలట్ చట్టం కింద సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిక్కులు జలియాన్‌ వాలాబాగ్‌కు చేరుకున్నారు. అదే రోజు సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సరం కూడా కావడంతో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరు అక్కడికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన జనరల్ డయ్యర్...నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపించాడు. పది నిమిషాలపాటు, 1650 రౌండ్లు కొనసాగిన ఈ కాల్పుల్లో... అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 1000 కి పైగానే ఉండగా.. మరో 2000 మందికి పైగా గాయపడ్డారు. పారిపోయేందుకు కూడా వీలు లేకపోవడంతో బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది అక్కడ ఉన్న బావిలో దూకగా వారిని కూడా పైకి తీసుకొచ్చి అత్యంత దారుణంగా హతమార్చారు. అదే సమయంలో నగరంలో కర్ఫ్యూ కూడా ​కొనసాగుతుండటంతో, ఆస్పత్రికి తీసుకువెళ్లే వీలులేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top