రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

On Rohingya Issue, Strike Balance Between Human Rights, Security, says SC - Sakshi

మానవహక్కులు.. జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాలి
రోహింగ్యాల దుస్థితిపై కేంద్రం సున్నితంగా వ్యవహరించాలి
మేం నిర్ణయించే వరకు వారిని పంపించకూడదు
సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని రోహింగ్యా ముస్లింలను పంపించే విషయమై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రోహింగ్యాల దుస్థితిపై కేంద్ర ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించింది. దేశంలోని శరణార్థుల సమస్యను ఎదుర్కొనే విషయంలో మానవ హక్కులు, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాల్సిన అవసరముందని పేర్కొంది.

అమాయక రోహింగ్యా మహిళలు, చిన్నారుల దుస్థితిని కోర్టు చూసీచూడకుండా వదిలేయలేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో మానవ హక్కుల, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాలని, ఈ విషయంలో అనేక అంశాలను పరిగణించాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకునే వరకు  దేశంలోని రోహింగ్యాలను డిపోర్ట్‌ చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోహింగ్యాలను పంపించే విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే పిటిషనర్‌ తమను ఆశ్రయించవచ్చునని తెలిపింది. దేశంలోని రోహింగ్యా శరణార్థుల తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు.

దేశంలోని రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు అక్రమ వలసదారులని, వారు దేశభద్రతకు ముప్పుగా పరిణమించారని, చట్టప్రకారం వారు దేశంలో నివసించడం కుదరదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top