లాక్‌డౌన్ ఎఫెక్ట్‌‌: స్వచ్ఛంగా మారుతున్న యమునా నది

River Yamuna Cleaned Itself In 60 Days Of Corona Virus Lockdown - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్కు ముందు దేశంలోని ప్రధాన నదులన్ని కాలుష్యకాసారాలుగా ఉండేవి. మురుగు నీరు, రసాయన వ్యర్థాలు, మానవ కళేబరాలతో కాలుష్యానికి కేంద్ర బిందువులుగా నిలిచేవి. అయితే కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఈ నదులకు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. దాదాపు రెండు నెలలుగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, పరిశ్రమలు మూతపడటంతో నదులన్ని తిరిగి స్వచ్ఛతను సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే యమునా నది గతంలో లేనంత స్వచ్ఛంగా మారింది. యమునా నది శుభ్రత కోసం గత 25 ఏళ్లుగా ప్రభుత్వాలు రూ.5000 కోట్లు ఖర్చు పెట్టాయి. కానీ ఫలితం  మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఏళ్లుగా.. కోట్లు ఖర్చు చేసినా రాని ఫలితాన్ని రెండు నెలల లాక్‌డౌన్‌ సాధించింది. కాలుష్యం తగ్గడంతో పక్షులు యమునకు వలస కట్టాయి. చేపల్ని, ఇతర నీటి ప్రాణుల్ని వేటాడుతూ.. ప్రకృతి ధర్మాన్ని నిర్వహిస్తున్నాయి. 

యమునా నది దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవునా ఏడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో నది ఒడ్డున ఉన్న పారిశ్రామిక యూనిట్లు వాటి మలినాలను యమునలోకి విడుదల చేస్తాయి. హర్యానా పానిపట్‌ నుంచి ఢిల్లీ మధ్య దాదాపు 300 యూనిట్లకు పైగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే పారిశ్రామిక ఉత్సర్గాలు యమునలో కలుస్తాయి. ఢిల్లీ, ఆగ్రా, మధుర వద్దే 80 శాతం కాలుష్య కారకాలు నదిలో కలుస్తాయి. ఫలితంగా ఇది దేశంలోనే అత్యంత కలుషితమైన నదిగా మారింది. (పరిశ్రమ మళ్లీ తెరుస్తున్నారా? జర భద్రం!)

అయితే లాక్‌డౌన్‌ వల్ల ఢిల్లీలో యమునా నది 33 శాతం స్వచ్ఛంగా మారినట్లు ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు తెలిపింది. మధుర దిశగా సాగే యమున మరింత శుభ్రంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా యమునా యాక్షన్‌ ప్లాన్‌ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘గత 30 ఏళ్లలో యమునా నదిని ఇంత శుభ్రంగా ఎప్పుడు చూడలేదు. సాధారణంగానే నదులకు తమను తాము శుభ్రపర్చుకునే లక్షణం ఉంటుంది. గత 2 నెలలుగా కాలుష్యకారకాలు యమునలో కలవకపోవడంతో స్వచ్ఛంగా మారింది. ఇది ఇలాగే కొనసాగాలంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top