ఇక ప్రైవేట్‌ జెట్లు...!

Rich People In India May Own Their Private Jet Planes - Sakshi

నిర్వహణ భారం లేకుండా విమానాలు సొంతం చేసుకునే వీలు

ఎయిర్‌క్రాఫ్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలతో  ఒప్పందం చేసుకోవచ్చు

కేంద్రం పరిశీలనలో కొత్త విధానం...

సంపన్న భారతీయులు, కంపెనీలు ఇక ’ప్రైవేట్‌ విమానాలు’ సొంతం చేసుకునే అవకాశం కలగబోతోంది. అదీకూడా ఈ విమానాల నిర్వహణ, వాటి మరమ్మతుల బాధ్యత లేకుండానే... ప్రైవేట్‌ జెట్‌లకు యజమానిగా ఒకరుంటే వాటిని మరొకరు ఆపరేటర్‌ రూపంలో నిర్వహించే వీలు కల్పించే ప్రతిపాదనకు దేశీయ విమానయానశాఖ తుదిరూపునిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఓ కంపెనీ లేదా ప్రైవేట్‌వ్యక్తి విమానాన్ని కొనుగోలు చేసి దాని నిర్వహణ బాధ్యతలను మరో ఎయిర్‌క్రాఫ్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి అప్పగించవచ్చు. ఈ రెండుకంపెనీలు, వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు విమానాల నిర్వహణ, ఆదాయ,వ్యయాలు ఏ మేరకు భరించాలన్నది ఖరారు చేస్తారు. 

ప్రస్తుతమున్న నియమ,నిబంధనల ›ప్రకారమైతే ఓ ప్రైవేట్‌ వ్యాపారవేత్త  విమానాన్ని ఆపరేట్‌ చేయాలంటే ప్రభుత్వపరంగా ఉన్న నియంత్రణలు పాటించాల్సిన అవసరముంది. ఈ విమానాలను నడిపేందుకు అవసరమైన ఫ్లయిట్‌ సెఫిటీ ఇన్‌చార్జీ మొదలుకుని ఇతర విమాన సిబ్బంది నియామకం వరకు అన్నీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి విమానాలను ప్రైవేట్‌ కంపెనీలు నడపడానికి ’నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్‌’ కేటగిరి కింద విడిగా రిజిష్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు  లేని కారణంగా తమ విమానాల నిర్వహణకు నాన్‌ షెడ్యూల్‌‍్డ ఆపరేటర్‌ కంపెనీలపై ప్రైవేట్‌ యజమానులు ఆధారపడాల్సి వస్తోంది.
 
ప్రస్తుతం అమెరికా, ఐరోపాలలో ప్రైవేట్‌ జెట్‌ల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతినే మనదేశంలోనూ అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ తరహా పద్ధతిని ఇక్కడ అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆర్థికశాఖతో పాటు కేంద్ర విమానయానశాఖ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 

ప్రైవేట్‌ విమానాల నిర్వహణ వ్యయం తలకు మించిన భారంగా మారిన కారణంగా వ్యాపారవేత్తలు వెనకడుగు వేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  తాము విమానం కొనుగోలు చేశాక దాని బాధ్యతలు చూసేందుకు విడిగా ఎయిర్‌క్రాఫ్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఉంటే చాలా మంది వ్యాపారవేత్తలు ముందుకు వస్తారని పేర్కొన్నాయి. ’భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల ఆలోచన అనేది పెద్దగా పుంజుకోలేదు. ఓ ప్రైవేట్‌  యజమాని విమానాన్ని కొనుగోలు చేసి విమానాల నిర్వహణ కంపెనీకి దానిని అప్పగించే పద్ధతి ఇక్కడా అమల్లోకి వస్తే మాత్రం ప్రస్తుతమున్న పరిస్థితిలో మార్పు వస్తుంది. ఈ కంపెనీలు విమానాలు నడిపేందుకు అవసరమైన అన్ని బాధ్యతలు తీసుకోవడం వల్ల యజమానులకు సమస్య ఉండదు’ అని బిజినెస్‌ ఎవియేషన్‌ ఆపరేటర్‌ అసోసియేషన్‌ ఎండీ ఆర్‌కే బాలి చెబుతున్నారు.

జీఎస్‌టీ తగ్గించాలి...
ప్రస్తుతం విమానాన్ని దిగుమతి చేసుకునే ‍వ్యాపారవేత్తలు కస్టమ్‌‍్స సుంకాలతో పాటు 28 శాతం వస్తు,సేవా పన్ను (జీఎస్‌టీ) చెల్లించాలి. నాన్‌ షెడ్యూల్‌‍్డ ఆపరేటర్లు  కస్టమ్‌‍్స పన్నులతో పాటు జీఎస్‌టీ కింద  18 శాతం  పన్నులు చెల్లిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యాపారవేత్తలకు కూడా జీఎస్‌టీ పన్నును 18 శాతానికి తగ్గిస్తే మరింత మంది వ్యాపారవేత్తలు నేరుగా విమానాలు దిగుమతి చేసుకోవడానికి ముందుకు వస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది దేశీయ విమానయానరంగ వ్యాపారం పెరిగేందుకు దోహదపడుతుందని అంటున్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top