
బొగ్గుపై13 శాతం పెరగనున్న జీఎస్టీ
టన్నుకు రూ.630 అదనం
ఏటా రూ.425 కోట్ల జీఎస్టీ వడ్డింపు
ఈ మొత్తం విద్యుత్ వినియోగదారులపైకే..
ఈఆర్‌సీ అనుమతి కోసం జెన్‌కో కసరత్తు
వచ్చే ఏడాది విద్యుత్ బిల్లుల భారం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు జీఎస్టీ షాక్ తగలబోతోంది. వస్తు సేవల పన్నుకు సంబంధించి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై ప్రభావం చూపుతోంది. జెన్‌కో వాడే బొగ్గు ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ పరిధిలో ఉంది. కొత్త శ్లాబులు అమలులోకి వస్తే ఇది 18 శాతానికి పెరుగుతుంది. అదనంగా 13 శాతం భారం పడుతుంది. దీనివల్ల ప్రతి టన్ను బొగ్గుపై అదనంగా రూ.630 భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో కాకుండా, పలు ప్రైవేటు సంస్థలతో విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇవి కూడా దేశీయ, విదేశీ బొగ్గును కొనుగోలు చేస్తున్నాయి. వీటిపై పడే జీఎస్టీ భారాన్ని విద్యుత్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. పెరిగే భారం ఎంత అనేది అధికారులు లెక్కగట్టాల్సి ఉంది. ఈ మొత్తానికి చార్జీలు పెంచుకునేందుకు విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత పెరిగిన బొగ్గు విలువను వార్షిక ఆదాయ, అవసర నివేదికలో పొందుపరుస్తారు. దీన్ని ఈఆర్‌సీ ఆమోదించిన తర్వాత వచ్చే ఏడాది కొత్త టారిఫ్‌లలో విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలపై భారం పడే అవకాశం ఉంది.
భారం రూ.300 కోట్లపైనే..!
టీజీ జెన్‌కో ప్లాంట్లకు ఏడాదికి 29 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. అయితే, పవన, సౌర విద్యుత్‌తోపాటు, బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తుండటంతో విద్యుత్ సంస్థలు వాటిని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో జెన్‌కో ప్లాంట్లను బ్యాక్ డౌన్ చేస్తున్నారు. ఏడాది పొడవున గరిష్టంగా 65%ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో పనిచేస్తున్నాయి. దీంతో ఏటా 15 మిలియన్ టన్ను ల వరకు బొగ్గు అవసరం ఉంటోంది. ప్రతి టన్ను బొగ్గును సింగరేణి నుంచి సగటున రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
జీఎస్టీ పెరగడం వల్ల అదనంగా టన్నుకు రూ.630 చెల్లించాలి. 15 మిలియన్ టన్నులకు రూ.945 కోట్ల వరకు భారం పడుతుంది. అయితే, బొగ్గుపై కొంత రాయితీ ఇవ్వాలన్నది కేంద్రం నిర్ణయం. ఇది తీసివేసినా ఏడాదికి రూ.300 కోట్ల పైనే భారం పడొచ్చని అంచనా వేస్తున్నారు. పీపీఏలున్న ప్రైవేటు సంస్థలపై పడే జీఎస్టీ భారం మరో రూ.125 కోట్లు ఉండొచ్చని అంచనా. మొత్తంగా రూ.425 కోట్ల మేర భారం ఉండొచ్చని చెబుతున్నారు.
పరిస్థితిని సమీక్షిస్తున్నాం
జీఎస్టీ శ్లాబులు మారడం వల్ల బొగ్గుపై వ్యయం పెరుగుతుంది. ఇది జెన్‌కోకు ఏమేర భారం కలిగిస్తుందనేది పరిశీలిస్తున్నాం. అధికారికంగా శ్లాబులు అమలులోకి వచ్చిన తర్వాత పెరిగే భారాన్ని విద్యుత్ నియంత్రణ కమిటీకి వివరిస్తాం. కమిషన్ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – హరీశ్, టీజీ జెన్‌కో సీఎండీ
ప్రజలకు ఇది భారమే
పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులపై జీఎస్టీని తగ్గించారు. కొత్తగా వచ్చే వాటికే ఇవి వర్తిస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేదు. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాడే బొగ్గుపై జీఎస్టీ పెంచారు. సెస్ తగ్గించినా జీఎస్టీ భారమే ఎక్కువ. ఈ భారం మొత్తం ప్రజలపైనే పడుతుంది. రాబోయే కాలంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది. - ఎం వేణుగోపాలరావు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్