
నేడు రామ్‌నాథ్ నామినేషన్
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
హాజరుకానున్న మోదీ, పలురాష్ట్రాల సీఎంలు
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటుగా కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న పలు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.
తెలంగాణ, ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు, పళనిస్వామిలు కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీయే సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కోవింద్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ మద్దతుగా సంతకాలు చేయనున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వంకు చెందిన అన్నాడీఎంకే(పురచ్చితలైవి అమ్మ) వర్గం కూడా కోవింద్‌కు మద్దతు పలికింది.
అక్బర్ రోడ్‌కు మారిన కోవింద్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడంతో.. భద్రత దృష్ట్యా కోవింద్ తాత్కాలిక చిరునామా మారింది. అక్బర్ రోడ్‌లోని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ నివాసాన్ని జూలై 17 వరకూ ఆయనకు కేటాయించారు. బిహార్ గవర్నర్ ఎన్నికయ్యాక ఆయనకు 144 నార్త్ ఎవెన్యూ నివాసాన్ని కేటాయించగా.. భద్రతా కారణాల రీత్యా ఈ మార్పులు చేశారు.