కేంద్రం హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ బంధువును ముగ్గురు దుండగులు కాల్చిచంపిన ఘటన ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది.
లక్నో: కేంద్రం హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ బంధువును ముగ్గురు దుండగులు కాల్చిచంపిన ఘటన ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది. బైక్పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బంక్ యజమాని అయిన అరవింద్ సింగ్ను అతి సమీపంనుండి మెడపై కాల్చి చంపారు. సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళ ఈ సంఘటనపై గ్రామస్తులకు సమాచారం అందించారు. భార్యను ఎయిర్పోర్ట్లో దించి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు దుండగులు అరవింద్ సింగ్ను అటకాయించిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం.
దుండగుల్లో ఒకడు అరవింద్ ప్రయాణిస్తున్న కారులోకి చొరబడి కొద్ది నిమిషాలు అతనితో మాటలు కలిపి ఆ తరువాత అతిసమీపం నుండి కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం సంఘటనా స్థలం నుంచి వారు పారిపోయారని చెప్పారు.
కాగా ఈ ఘటనలో ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఖాళీ తూటాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఎకే పాండే (రూరల్) తెలిపారు.
రాష్ట్రంలో పాలన కొరవడిందని, ప్రతీరోజు జనం చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తర ప్రదేశ్ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.