సుష్మాకు రాజ్‌నాథ్‌ మద్దతు

Rajnath Singh Dialled Sushma Swaraj Expressed Sympathy - Sakshi

ఆ ప్రశ్నకు సమాధానం దాటవేత

న్యూఢిల్లీ : ఓ హిందూ–ముస్లిం జంట పట్ల సానుకూలంగా స్పందించినందుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సోషల్‌ మీడియా వేదికగా కొందరు గత వారం రోజులుగా నానా దుర్భాషలాడుతున్న విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాగానీ, ఆ పార్టీలో ఏ ఒక్కరైనాగానీ, ఆఖరికి సుష్మా స్వరాజ్‌ సహచర మహిళా మంత్రులుగానీ ఆమెకు మద్దుతు తెలపలేదు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాత్రం ఆమెకు ఫోన్‌ చేసి సానుభూతి తెలిపినట్లు మీడియాకు తెలిపారు. సోమవారం ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడుతూ.. ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్స్‌ వచ్చిన వెంటనే ఫోన్‌ చేశానని, ఈ ఘటనపై కూడా ఆరా తీసినట్లు చెప్పారు. అయితే ఆమెకు సోషల్ మీడియా వేదికగానే మద్దతు తెలుపవచ్చు కదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రాజ్‌నాథ్‌ సింగ్‌ దాట వేశారు.

ఓ హిందూ-ముస్లిం జంటకు పాస్‌పోర్ట్‌ వివాదంలో లక్నో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం అధికారి వికాశ్‌ మిశ్రాను సుష్మా గోరఖ్‌పైర్‌కు బదిలీ చేశారు. దీంతో కొందరు సోషల్‌ మీడియాలో సుష్మ లక్ష్యంగా అసభ్యకరంగా దూషణలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో ఆమె ఆదివారం ట్విటర్‌లో నిర్వహించిన పోల్‌కు అనూహ్య మద్దతు లభించింది. ‘ట్విటర్‌లో  నన్ను లక్ష్యంగా చేసుకుని ఇలా దూషించడాన్ని మీరు సమర్థిస్తారా?’ అన్న సుష్మ ప్రశ్నకు 57 శాతం మంది సమర్థించబోమని తేల్చిచెప్పారు. 43 శాతం మంది మాత్రం దూషించినవారికి మద్దతు ప్రకటించారు. ఈ సర్వేలో మొత్తం 1.2 లక్షల మంది పాల్గొన్నారు. అయితే ఏ విషయంలోనైనా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బీజేపీ శ్రేణులు తమ పార్టీ మహిళా మంత్రి పట్ల ఇంత ట్రోల్‌ జరుగుతున్న స్పందించకపోవడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top