సచిన్‌ పైలట్‌కు గహ్లోత్‌ చురకలు

Rajasthan CM Ashok Gehlot Flays Sachin Pilot - Sakshi

సిద్ధాంతాలే ముఖ్యం : గహ్లోత్‌

జైపూర్‌ : రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్‌ నేత సచిన్‌ పైలట్‌పై ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్‌ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్‌ భాగస్వామిగా మారారని ఆరోపించారు. ‘ఇంగ్లీష్‌ బాగా మాట్లాడటం, మీడియాకు మంచిగా అభిప్రాయాలు వెల్లడించడం, అందంగా ఉండటం ఒక్కటే సరిపోద’ని సచిన్‌ పైలట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశం కోసం మీ హృదయంలో ఏముంది. సిద్ధాంతం..విధానాలు..అంకితభావం అనేవి కీలకమని హితవు పలికారు. జైపూర్‌లో ఎమ్మెల్యేల బేరసారాలు సాగుతున్నాయని, దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. పదిరోజుల పాటు ఎమ్మెల్యేలను హోటల్‌లో ఉంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే మనేసర్‌లో జరిగిందే ఇప్పుడు కూడా పునరావృతమవుతుందని అన్నారు.

తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, నూతన తరాన్ని తాము స్వాగతిస్తామని, భవిష్యత్‌ వారిదేనని గహ్లోత్‌ అన్నారు. ఇప్పటి తరం నేతలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ చీఫ్‌లుగా ఎదిగారని..ఈ రకంగా వారు ఎదుగుతుంటే వారి వయసులో తాము ఒక్కో మెట్టు ఎక్కివచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా తొలగించబడిన సచిన్‌ పైలట్‌ సహా 18 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలకు రాజస్ధాన్‌ స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరిన మీదట స్పీకర్‌ ఈ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లోగా వారు నోటీసులపై బదులివ్వాలని ఆదేశించిన నేపథ్యంలో రెబెల్‌ నేత పైలట్‌పై ముఖ్యమంత్రి గహ్లోత్‌ తీవ్రస్ధాయిలో విమర్శలకు దిగారు. కాగా, జైపూర్‌లో మంగళవారం జరిగిన రెండో దఫా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) భేటీకి కూడా సచిన్‌ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో పార్టీ అధిష్టానం వారిపై వేటువేసిన సంగతి తెలిసిందే. పైలట్‌తోపాటు అతని సన్నిహితులైన ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్‌ మీనాలను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది.

చదవండి : పైలట్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన గహ్లోత్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top