ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాం : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Says Stand With Govt And Jawans Over Pulwama Terror Attack - Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన పట్ల విచారం చేసిన రాహుల్‌.. రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం అంతిమ లక్ష్యం దేశాన్ని విభజించడమేనని పేర్కొన్నారు. అందుకే వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులు ఎంతగా ప్రయత్నించినా ఒక్క సెకను పాటు కూడా హిందుస్థాన్‌ ప్రజలను వేరుచేయలేరన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఒకేతాటిపై నిలవాలని, అపుడే మన ఐక్యత గురించి వారి తెలుస్తుందని పేర్కొన్నారు.

వేరే చర్చకు తావు లేదు..
‘ ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

ఉక్కుపాదం మోపాలి..
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదం పట్ల ఉక్కుపాదం మోపాలని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top