ఉద్రిక్తంగానే శబరిమల

Protests Continuing At Sabarimala Temple - Sakshi

కొండపైకి వెళ్లి గుళ్లోకి ప్రవేశించలేకపోయిన ఇద్దరు మహిళలు

పవిత్రమైన 18 మెట్లపై బైఠాయించి అడ్డుకున్న భక్తులు

ఆ ఇద్దరు వస్తే తాళం వేసి వెళ్లిపోతానన్న ప్రధాన అర్చకుడు

వారిలో ఓ సామాజిక కార్యకర్త ఉండటంపై వివాదం

శబరిమల : పోలీసుల గట్టి భద్రత నడుమ శుక్రవారం శబరిమలపైకి చేరుకున్న ఇద్దరు మహిళలు తీవ్ర నిరసనల కారణంగా గుడిలోకి వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అయ్యప్ప భక్తుల నిరసనతోపాటు స్త్రీలు ఆలయంలోకి వస్తే తాను తలుపులు మూసేసి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు కూడా స్పష్టం చేయడంతో ప్రభుత్వం, పోలీసులు వెనక్కుతగ్గారు. బలప్రయోగంతో భక్తులను పక్కకు తప్పించి వారి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో మహిళలను వెనక్కు పంపుతున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇద్దరు స్త్రీలలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన విలేకరి కవిత జక్కల్‌ కాగా, మరొకరు కేరళకు చెందిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా అని పోలీసులు తెలిపారు. స్వామి దర్శనం కాకుండా కొండ దిగబోమని మొదట పట్టుబట్టిన వీరిద్దరు.. పరిస్థితిని పోలీసులు వివరించడంతో భద్రత మధ్యనే కిందకు వచ్చారు. పోలీసుల భద్రతతో వారిద్దరూ దర్శనంక్యూ కాంప్లెక్స్‌ వరకు రాగలిగారు. ఆలయంలోని పవిత్ర మైన 18 మెట్లపై పిల్లలు, వృద్ధులు సహా అయ్యప్ప స్వామి భక్తులు బైఠాయించి ‘స్వామియే శరణమయ్యప్ప’ అని జపిస్తూ అడ్డుకోవడంతో కవిత, ఫాతిమాలు వెనుదిరగక తప్పలేదు. రుతుస్రావం అయ్యే వయసుల్లోని మహిళలు శబరిమలకు వెళ్లకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గత నెల 28న సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, ఆ తీర్పును వ్యతిరేకిస్తూ అప్పటి నుంచి కేరళ వ్యాప్తంగా తీవ్రంగా ఆందోళనలు జరుగుతుండటం తెలిసిందే. ఏపీకి చెందిన మాధవి, ఢిల్లీకి చెందిన విలేకరి సుహాసిని రాజ్‌ కూడా గత రెండ్రోజుల్లో కొండ ఎక్కేందుకు విఫలయత్నం చేశారు.

బలనిరూపణకు స్థానం కాదిది: మంత్రి
శబరిమలకు చేరుకున్న ఇద్దరు మహిళల్లో ఒక సామాజిక కార్యకర్త ఉండటం పట్ల కేరళ దేవస్థాన శాఖ మంత్రి సురేంద్రన్‌ పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు తీర్పు భక్తులకు రక్షణ కల్పించాలని చెబుతోంది కానీ తమ బలం నిరూపించుకునేందుకు వచ్చే సామాజిక కార్యకర్తలకు కాదు. కొండకు తీసుకెళ్లేముందు ఆమె వివరాలు, ఉద్దేశాలను పోలీసులు తనిఖీ చేసి ఉండాల్సింది. సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు తమ బలం చూపించేందుకు పవిత్ర శబరిమల స్థానం కాదు’ అని అన్నారు. కాగా, ఈ అంశంపై కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితల మాట్లాడుతూ ‘పోలీసులు నిజమైన భక్తులకు భద్రత కల్పిస్తున్నారా లేక ఉద్యమకారులకా? సుప్రీంకోర్టు తీర్పు ఇదేనా?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకే ప్రభుత్వం సామాజిక కార్యకర్తలను కొండపైకి తీసుకెళ్లిందని ఆయన ఆరోపించారు. అటు బీజేపీ కేరళ అధ్యక్షుడు శ్రీధరన్‌ పిళ్లై మాట్లాడుతూ ప్రభుత్వం శబరిమలను రణరంగంగా మార్చాలనుకుంటోందనీ, ఓ మహిళకు పోలీసులు తమ యూనిఫాం, హెల్మెట్‌ కూడా ఇచ్చి భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా కొండపైకి తీసుకెళ్లడానికి కారణం ఇదేనని విమర్శించారు.

ఒప్పుకున్నాకే కిందకు తీసుకొచ్చాం: ఐజీ
ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) శ్రీజిత్‌ నేతృత్వంలోని పోలీసుల బృందం మహిళలను భద్రతతో శబరిమలపైకి తీసుకెళ్లింది. అక్కడ ఐజీ మాట్లాడుతూ ‘వీరు ఆలయంలోకి వస్తే గుడి తలుపులు మూసేసి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు నాతో చెప్పారు. భక్తులపై బలప్రయోగం చేయొద్దని ప్రభుత్వం నుంచి కూడా సూచనలు అందాయి. ఈ విషయాలను ఇద్దరికీ వివరించడంతో కిందకు వెళ్లేందుకు వారు ఒప్పుకున్నారు. భద్రతతోనే మళ్లీ వారిని కిందకు తీసుకొచ్చాం’ అని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top