పాములంటే భయమా? ఇది చదవాల్సిందే..

Prasadam Industries Creates A Solar Powered Snake Guard - Sakshi

బెంగళూరు: విషసర్పాలంటే ఎవరికి మాత్రం భయం ఉండదు! మనదేశంలో పాము కాటుకు ఏటా 46వేల మంది ప్రాణాలు కోల్పుతున్నారు. ఇలా చనిపోతున్నవారిలో అత్యధికులు గ్రామీణ రైతులు, కూలీలే అన్నది వాస్తవం. మరోవైపు కాటువేయకపోయినా జనం చేతిలో చనిపోతున్న పాముల సంఖ్యకు లెక్కేలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఔత్సాహికులు రూపొందిచిన ‘స్నేక్‌ గార్డ్‌’ ఇటీవల చర్చనీయాంశమైంది. పాముకాటు నుంచి మన రైతాంగాన్ని కాపాడుకోవడంతోపాటు ఆ మూగజీవాలకు సైతం సంరక్షించగల ఆధునిక యంత్రపరికరం ‘స్నేక్‌ గార్డ్‌’ ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర రైతుల మన్ననలు పొందింది.

ఏమిటీ స్నేక్‌ గార్డ్‌?: చేతికర్రను పోలిఉంటే యంత్రాన్ని భూమిపై నిలిపినప్పుడు ఆల్ట్రాసోనిక్‌ తరంగాలు విడుదలవుతాయి. యంత్రాన్ని నిలిపిన చోట నుంచి చుట్టూ 50 అడుగుల పరిధిలో(భూమిపొరలగుండా) తరంగాలు విస్తరిస్తాయి. ఇవి పాము వికర్షకాలు(snake repellents)గా పనిచేస్తాయి. అంటే ఈ తరగాలు వచ్చే చోట ఏదో ప్రమాదం పొంచిఉందని పాములు గ్రహించి.. అక్కడి నుంచి దూరంగా పారిపోతాయన్నమాట! 10 సెకన్లకు ఒకసారి తరంగాలు నిరంతరాయంగా వస్తూఉంటాయి. సౌరవిద్యుత్‌(solar powered)తో పనిచేస్తుంది కాబట్టి స్నేక్‌గార్డ్‌ను వినియోగించడం చాలా సులువు.

ప్రభుత్వ ఆమోదం లభిస్తే..: ‘‘స్నేక్‌గార్డ్‌ యంత్రం రైతుల ప్రాణాలనేకాదు మూగజీవాలను కూడా కాపాడుతుంది. అతి సాధారణ సాంకేతిక పరిజ్ఞానంతో మనుషులు-పాములు ఎదురుపడకుండా నివారించగలుగుతున్నాం. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా కొంతమంది రైతులకు స్నేక్‌గార్డ్‌ స్టిక్స్‌ను అందించాం. నల్లరేగడి, ఎర్రనేలలు, ఒండ్రుమట్టి లాంటి వేర్వేరు నేలల్లో స్నేక్‌ గార్డ్‌ పనితీరును అధ్యయనం చేస్తున్నాం. అతి త్వరలోనే ఈ ఆవిష్కరణను ప్రభుత్వం ముందుకు తీసుకెళతాం. వ్యవసాయ శాఖల ఆమోదం లభిస్తే మరింతగా విస్తరిస్తాం’’ అని చెబుతున్నారు ప్రసాదం ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు వేదబ్రతో రాయ్‌. స్నేక్‌గార్డ్‌ యంత్రాల పంపిణీని ప్రభుత్వాలే చేపడితే ధర నామమాత్రంగానే ఉండొచ్చు. వీటిలా చేత్తో పట్టుకెళ్లేవి కాకుండా, ఒకే చోట నిలిపి ఉంచే ఇతర కంపెనీల స్నేక్‌ గార్డుల ధర అమెజాన్‌లో మూడున్నర వేల రూపాయల దాకా ఉంది. మరిన్ని వివరాల కోసం ప్రసాదం ఇండస్ట్రీస్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌ను చూడొచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top