అభివృద్ధి, పర్యావరణం రెండు కళ్లు : జవదేకర్‌

Prakash Javadekar Has Talks About The Drive At Aarey - Sakshi

న్యూఢిల్లీ : ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేత వివాదంపై పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ మాట్లాడడానికి నిరాకరించారు. అభివృద్ధి, పర్యావరణం తమకు రెండు కళ్లలాంటివని చెప్పారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది. కనుక నేను ఆరే కాలనీ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. ఎందుకంటే ఆరే ఏరియాలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జరుగుతున్న చెట్ల నరికివేతను అడ్డుకున్న పర్యావరణ వేత్తలు, ఆందోళనకారులకు ఊరటనిచ్చే ఉత్తర్వులు సుప్రీంకోర్టు నుంచి వచ్చాయి. శనివారం నుంచి ఆరే కాలనీలో చెట్ల నరికివేత సాగుతుండగా.. సుప్రీంకోర్టు తాజాగా దానిపై స్టే విధించింది. ఈ అంశంపై ప్రత్యేకంగా ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. అలాగే ప్రస్తుతానికి చెట్ల నరకివేతపై స్టే ఇచ్చింది’ అని గుర్తుచేశారు. అలాగే ముంబై మెట్రో నిర్వాహకులు ఒక చెట్టును నరికితే.. వారు తిరిగి ఐదు చెట్లను పెంచే బాధ్యతను తీసుకోవాలని మీడియా ప్రతినిధులకు జవదేకర్‌ సూచించారు.

కాగా, ముంబై ఆరే కాలనీలో మెట్రో రైలు ప్రాజెక్టు మూడో ఫేజ్ నిర్మాణంలో చెట్లను నరకడానికి  వీల్లేదంటూ కొంతమంది ఆందోళనకారులు, పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాగే  కొంతమంది న్యాయ విద్యార్థుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి లేఖ రాసింది. చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని ఆదేశించాలని వారు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. దీంతో జస్టిస్‌ గొగోయ్‌ ఈ కేసు విచారణకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ప్రత్యేకంగా ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 21కి విచారణను వాయిదా వేసింది.

అలాగే ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ దేశ రాజధానిలో మెట్రో నిర్మాణం కోసం చెట్లను తొలగించాల్సి వచ్చింది. ఆనాడు మెట్రో అధికారులు 20-25 చెట్లను తొలగించగా ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కానీ మెట్రో నిర్మాణం అనంతరం వారు తీసివేసిన ప్రతి చెట్టుకు ఐదు చెట్లను నాటారు. నేడు మెట్రో రవాణా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ముప్పై లక్షల మంది ప్రజలు మెట్రోను వినియోగించుకుంటున్నారు. అభివృద్ధి యొక్క మంత్రం పర్యావరణాన్ని పరిరక్షించడం. అభివృద్ధి, పర్యావరణం అనేవి రెండు కలిసి ముందుకు సాగాల్సినవి. ముంబై మహా నగరంలో ఆరే కాలనీ ఓ అద్భుతమైన ప్రాంతం. అదో గ్రీన్ బెల్ట్. అక్కడ 5 లక్షలకు పైగా చెట్లు ఉన్నాయి. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అందులో భాగమే. ఒక్కమాటలో చెప్పాలంటే ముంబైకి అది హరిత ఊపిరితిత్తి లాంటిద’ని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top