‘కేదార్‌నాథ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం’

PM Modi Says He Has Special Bond With Kedarnath - Sakshi

డెహ్రాడూన్‌ : హిమాలయాల్లో కొలువుదీరిన పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రకృతి, పర్యావరణానికి హాని కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆలయ సందర్శన, ధ్యానం అనంతరం మోదీ విలేకరులతో మాట్లాడుతూ..‘ కేదార్‌నాథ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 2013లో సంభవించిన పెను విషాదం తర్వాత ఈ పుణ్యక్షేత్రాన్ని పునరుద్ధరించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాను. మీరు విదేశాలను సందర్శించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అంతకంటే ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కసారైనా పర్యటించండి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్విటర్‌ వేదికగా కోరారు. ఈ దఫా రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు కావాలని ఆకాంక్షించారు.

కాగా శనివారం ఉదయమే ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బూడిద రంగు సంప్రదాయ దుస్తులు ధరించిన ఆయన.. హిమాచల్‌ సంప్రదాయ టోపీ పెట్టుకుని కాషాయరంగు కండువాను నడుముకు చుట్టుకున్నారు. సుమారు అర్ధగంట పాటు ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మందాకినీ నదీ సమీపంలో ఉన్న ఈ 11,755 అడుగుల ఎత్తుగల కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రంలో ప్రదక్షిణలు చేశారు. ఇక లోక్‌సభ చివరి విడత పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రధాని.. ఆలయాల సందర్శన ఆసక్తికరంగా మారింది. కేదార్‌నాథ్‌తో పాటుగా బద్రీనాథ్‌ ఆలయాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన బద్రీనాథ్‌కు పయనం కానున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top