మన్‌ కీ బాత్‌: ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు?

PM Modi Likely To Talk About Covid 19 Situation In Mann Ki Baat - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా(కోవిడ్‌-19)పై పోరులో భారత్‌ సాధిస్తున్న పురోగతి గురించి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. అదే విధంగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనుసరించబోయే వ్యూహాలను జాతితో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాటి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆలిండియా రేడియో ఏప్రిల్‌ 26 ఉదయం 11 గంటలకు ప్రధాని కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. 

కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 24 అర్ధరాత్రి లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అంటువ్యాధి ప్రబలకుండా ఉండేందుకు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నామని.. ఇందుకు ప్రజలు తమను క్షమించాలని కోరారు. అదే విధంగా లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అంతేగాకుండా కరోనాపై పోరులో ప్రాణాలు పణంగా పెట్టి ముందుండి నడుస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సహా ఇతర సిబ్బంది పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. (ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ)

ఈ నేపథ్యంలో ఆదివారం  నాటి మన్‌ కీ బాత్‌లో మోదీ ఏం మాట్లాడనున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఢిల్లీ నుంచి ప్రసారం కానున్న ఈ కార్యక్రమాన్ని ఎఫ్‌ఎం గోల్డ్‌, ఎఫ్‌ఎం రెయిన్‌బో తదితర స్థానిక రేడియో స్టేషన్ల నుంచి ఏకకాలంలో వినవచ్చు. ఛత్తీస్‌గఢీ​, సర్గూజిహా, గోండి, హల్బీ తదితర మాండలికాల్లోనూ మన్‌ కీ బాత్‌ ప్రసారం అవుతుందని.. రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ప్రోగ్రామ్‌ పునఃప్రసారం అవుతుందని ఏఐఆర్‌ తెలిపింది. దూరదర్శన్‌ సహా ఇతర ప్రైవేటు టీవీ న్యూస్‌ చానెళ్లలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం కానున్నాయి. ఇక నెలకొకసారి( చివరి ఆదివారం) మోదీ మన్‌ ​కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రజలతో తన మనసులో మాట పంచుకుంటారన్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top