పీఎస్‌ఓలకు ప్రత్యేక వాహనం కావాలంటూ ధర్నా

PM Modi Brother Sits On Dharna Demanding Escort Vehicle - Sakshi

జైపూర్‌ : వ్యక్తిగత భద్రతాసిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ మంగళవారం ఆందోళనకు దిగారు.  జైపూర్‌ - అజ్మేర్‌ జాతీయ రహదారి మార్గంలోని బగ్రు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం  ప్రహ్లాద్‌ మోదీకి ఇద్దరు పీఎస్‌వో(వ్యక్తిగత భద్రతా అధికారులు)లను కేటాయించింది. నిబంధనల ప్రకారం.. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రహ్లాద్‌తో పాటు ఒకే వాహనంలో వెళ్లాలి. అయితే ఇందుకు ఆయన అంగీకరించలేదు. భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లడం కుదరదని.. వారికి ప్రత్యేక పోలీస్‌ వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

అంతటితో ఊరుకోక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట పాటు ప్రహ్లాద్‌ ఆందోళన సాగింది. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ప్రహ్లాద్‌ మోదీ భద్రతా సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం గురించి ప్రహ్లాద్‌ మోదీ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నా భద్రత కోసం ఇద్దరు పీఎస్‌ఓలను కేటాయించింది. నేను ఎక్కడికి వెళ్లినా వారు నాతో పాటే వస్తారు. అయితే ఈ సారి నేను కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నాను. దాంతో నా కారులో చోటు లేదు. అందుకే వారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కోరాను. కానీ వారు అంగీకరించలేద’ని ప్రహ్లాద్‌ మోదీ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top