పార్లమెంటు సమాచారం


సరి-బేసితో పెద్ద ప్రయోజనం లేదు.. కేంద్రం: వచ్చే నెల 15 నుంచి ఢిల్లీలో సరి-బేసి సంఖ్యల ఆధారంగా వాహనాలను రోడ్లపై అనుమతించే విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్రం  స్పందించింది. కేవలం ఒక్క సరి-బేసి విధానంతోనే ఢిల్లీలోని కాలుష్యం గణనీయంగా తగ్గదని లోక్‌సభకు తెలిపింది.    ఏకీకృత ఫార్మాకోడ్: ఫార్మా రంగంలో అనైతిక విధానాలను అరికట్టేందుకు తెచ్చిన ‘ఫార్మాసూటికల్ మార్కెటింగ్‌లో ఏకీకృత విధానాన్ని (యూసీపీఎంపీ)’ తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెప్పింది.   అద్దె విధానం: నగరాల్లో రెంటల్ హౌసింగ్‌ను ప్రోత్సహించేందుకు ‘జాతీయ పట్టణ అద్దె గృహాల విధానం’ పేరుతో చట్టాన్ని తెస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎయిర్ బ్యాగ్స్ యోచన లేదు: అన్ని రకాల కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ కచ్చితంగా ఉండాలనే నిబంధన తీసుకురావాలన్న ప్రతిపాదనపై ప్రస్తుతానికి ఎలాంటి యోచన లేదని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రమాదాల నుంచి వాహనాల్లోని ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు 2017 అక్టోబర్ నుంచి సవరణలు తెస్తామంది. చెరకు మిల్లుల రుణాల ఎత్తివేతకు నో: చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు రూ.15,893 కోట్లకు చేరాయని, ఆ రుణాల ఎత్తివేతపై, కొత్త ప్యాకేజీ ప్రకటనపై యోచించడం లేదని ప్రభుత్వం చెప్పింది.   30నెలల్లో 42 మెగా ఫుడ్ పార్క్‌లు: రానున్న 30 నెలల్లో రూ. 12వేల కోట్ల పెట్టుబడులతో 42 మెగా ఫుడ్ పార్క్‌లను ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నామని  ప్రభుత్వం తెలిపింది. పుర్రెగుర్తు 50 శాతానికే: పొగాకు ఉత్పత్తులపై పుర్రెగుర్తు పరిమాణాన్ని ఇప్పుడున్న 40 శాతం నుంచి  50 శాతానికి మాత్రమే పెంచాలని పార్లమెంటు కమిటీ  సూచించింది. ప్రభుత్వం చెప్పినట్టు 85శాతం సరైంది కాదంది. లబ్ధిదారుల డేటాబేస్ ఆధారంగా అసంఘటిత రంగంలోని 40 కోట్ల మంది కార్మికులకు ఆధార్ కార్డులివ్వాలని మరో కమిటీ సూచించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top