భారత్‌ కోసమే పనిచేస్తున్నా! | Pakistan releases another 'confessional' video of Kulbhushan Jadhav | Sakshi
Sakshi News home page

భారత్‌ కోసమే పనిచేస్తున్నా!

Jan 5 2018 3:31 AM | Updated on Jul 25 2018 1:49 PM

Pakistan releases another 'confessional' video of Kulbhushan Jadhav  - Sakshi

ఇస్లామాబాద్‌: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(47)కు సంబంధించిన మరో వీడియోను పాకిస్తాన్‌ గురువారం విడుదల చేసింది. పాక్‌ పర్యటన సందర్భంగా జాధవ్‌ కుటుంబసభ్యులతో ఆ దేశ అధికారులు వ్యవహరించిన తీరును భారత్‌ తీవ్రంగా నిరసించిన నేపథ్యంలో.. పాక్‌కు మద్దతుగా జాధవ్‌ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియోను విడుదల చేయడం గమనార్హం. తాను భారత నిఘా విభాగంలోనే విధుల్లో ఉన్నానని, ఈ విషయంలో భారత్‌ అబద్ధాలు చెబుతోందని అందులో జాధవ్‌ పేర్కొన్నారు. అయితే  బలవంతంగా జాధవ్‌తో ఆ మాటలు చెప్పించినట్లు స్పష్టంగా తెలుస్తోందని, ఆ వీడియోకు ఎలాంటి విశ్వసనీయత లేదని భారత్‌ ఘాటుగా స్పందించింది.   

ఆ వీడియోలో.. ‘భారత ప్రజలకు, ప్రభుత్వానికి, నేవీకి నేను ఓ విషయం స్పష్టం చేయదలచుకున్నా. నేనింకా భారత నావికాదళంలో ఉద్యోగినే. నేను విధుల్లోంచి తప్పుకోలేదు. నేను నిఘా వర్గాలతో కలిసి పనిచేస్తున్నానన్న విషయంలో మీరు(భారత ప్రభుత్వం) ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?’ అని ప్రశ్నించారు. ‘సమావేశపు గది నుంచి బయటకు వెళ్లగానే మా అమ్మపై భారత దౌత్యాధికారి గట్టిగా అరవడంతో పాటు తీవ్రంగా కోప్పడ్డారు. ఆమె కళ్లలో నేనప్పుడు భయం చూశాను.

నా కుటుంబ సభ్యులతో భేటీ సానుకూలంగా సాగింది. ఏమాత్రం ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా నేను మా అమ్మకు చెప్పాను. ఈ భేటీ తర్వాత నేను, నా తల్లి ఆనందంగా ఉన్నాం’ అని జాధవ్‌ వీడియోలో వెల్లడించారు.   అయితే జాధవ్‌ను జైష్‌–ఉల్‌–అదిల్‌ ఉగ్రసంస్థ ఇరాన్‌లోని సర్బాజ్‌ నుంచి కిడ్నాప్‌ చేసిందని భారత వర్గాలు తెలిపాయి. ఈ సంస్థకు చెందిన ముల్లా ఒమర్‌ ఇరానీ జాధవ్‌ను అపహరించి పాక్‌ సైన్యానికి అప్పగించినట్లు వెల్లడించాయి. బలోచ్‌ వేర్పాటువాదుల్ని ఏరివేసేందుకు పాక్‌ ఆర్మీ ఈ సంస్థను వినియోగించుకుంటోందని పేర్కొన్నాయి.

ఎలాంటి విశ్వసనీయత లేదు
పాక్‌ జాధవ్‌ నేరాంగీకార వీడియోను విడుదల చేయడంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘పాక్‌ చర్యలు మాకు ఆశ్చర్యం కలిగించలేదు. బందీల చేత బలవంతంగా వాంగ్మూలం ఇప్పించే సంప్రదాయాన్ని ఆ దేశం కొనసాగిస్తోంది. కేవలం ప్రచారం కోసం చేసే ఇలాంటి పనులకు ఎలాంటి విశ్వసనీయత ఉండదన్న విషయాన్ని పాక్‌ అర్థం చేసుకోవాలి’ అని హితవు పలికారు. బందీల చేత తమ ఆరోపణల్ని వల్లె వేయించడంతో పాటు వారు క్షేమంగా ఉన్నట్లు విడుదల చేసే వీడియోలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement