
సాక్షి, చెన్నై: హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వాహన చోదకుడి తలను ఓ పోలీసు లాఠీతో పగులగొట్టాడు. కన్యాకుమారిలో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. కన్యాకుమారి జిల్లా తిరువట్టారు పోలీసుస్టేషన్ ఏఎస్‌ఐ దేవరాజ్ స్థానికంగా వాహనాల తనిఖీల్లో శుక్రవారం మధ్యాహ్నం నిమగ్నమయ్యారు. అటు వైపుగా హెల్మెట్ లేకుండా వచ్చిన వాహన చోదకుడ్ని అడ్డుకునే యత్నం చేశాడు. అతడు తప్పించుకునే క్రమంలో ఉండగా దేవరాజ్ తన లాఠీకి పని పెట్టాడు.
ఆ బైక్‌ను వెంబడిస్తూ వెనుకవైపు కూర్చున్న రాజేష్ అనే యువకుడి తలను తన లాఠీతో పగలకొట్టాడు. తీవ్ర రక్త స్త్రావంతో ఆ యువకుడు కింద పడ్డాడు. ఏఎస్‌ఐ చర్యల్ని అక్కడున్న జనం నిలదీయగా, వారిపై సైతం లాఠీ ఝుళిపించడం ఉద్రిక్తతకు దారి తీసింది. జనం పెద్ద సంఖ్యలో తిరగబడడంతో అక్కడి నుంచి ఆ ఏఎస్‌ఐ పరుగులు తీశాడు.