
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈసీ అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం రేపటి (సోమవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓం ప్రకాశ్ రావత్‌ను సీఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన ఏకే జ్యోతి గతేడాది జూలై 6న బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అశోక్ లావసను ఎన్నికల కమిషనర్ గా నిమమించారు. ఆయన మంగళవారం రోజు బాధ్యతలు చేపట్టనున్నారు.
1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వారు రావత్. 64 ఏళ్ల రావత్ పలు రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ పలు హోదాల్లో సేవలు అందించారు. భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 2010లో ఆయన ఉత్తమ సేవలకుగానూ ప్రధాన మంత్రి నుంచి అవార్డ్ అందుకున్నారు.