కేరళ వరదలు: నర్సు లినీ భర్త పెద్దమనసు

Nurse Lini husband donates first salary to Kerala flood victims - Sakshi

తిరువనంతపురం: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు  అనేక మంది సెలబ్రిటీలు, పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఓ దాత  ఆకర్షణీయంగా  నిలిచారు.  వరదబాధితుల సహాయార్ధం తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇంతకీ ఎవరా దాత అనుకుంటున్నారా... కేరళను వణికించిన నిపా వైరస్‌  భూతానికి బలైపోయిన లినీ భర్త.. సాజీష్‌.  కేరళలో నిపా వైరస్‌ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి ప్రాణాలు విడిచిన నర్సు లినీ పుత్తుస్సెరి అందరి మనసుల్లో నిలిచిపోతే.. ఆమె భర్త కూడా ఆమె అడుగుజాడల్లోనే నడిచి పెద్దమనసును చాటుకున్నారు. తన దాతృత‍్వంతో పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

లినీ మరణం తరువాత ఆమె భర్త సాజీష్‌ బహ్రెయిన్లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, తన ఇద్దరు  పిల్లల్ని చూసుకోవడం కోసం కేరళకు తిరిగి వచ్చారు. ప్రభుత్వ వాగ్దానం ప్రకారం కొఠారి పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో డివిజనల్ క్లర్క్‌గా  ఉద్యోగాన్ని ఇచ్చింది. ఒక నెలక్రితం సాజీష్‌ ఈ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇంతలో కేరళ ప్రజలు వరదలతో  భారీ విపత్తులో చిక్కుకున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు బాధితులకు ఈ కథనాలను చూసినసజీష్‌ తన మొదటి నెలజీతాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.  ముఖ్యమంత్రి డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్‌కు చెక్‌ను కార్మికశాఖ మంత్రి రామకృష్ణన్‌కు అందించారు.

కాగా ఇటీవల కేరళలో ప్రాణాంతక నిపా  వైరస్‌ కలకలం రేపింది. దాదాపు 16మందిని పొట్టన పెట్టుకుంది. అయితే ఈ వ్యాధి బారిన పడిన బాధితులకు విశేష సేవలందించిన నర్సు లినీ చివరకు ఆ నిపా వైరస్‌కు బలైపోయింది. ఈ సందర్భంగా తన చివరి క్షణాల్లో భర్తకు రాసిన లేఖ కంటతడి పెట్టించింది. అయితే లినీ మరణంపై స్పందించిన కేరళ సర్కారు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. లినీ భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు, లినీ ఇద్దరు పిల్లలకు (5 ఏళ్లు, 2 ఏళ్లు) రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top