కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర డ్యాంలో నీరు పూర్తిగా ఖాళీ అయింది.
బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర డ్యాంలో నీరు పూర్తిగా ఖాళీ అయింది. తుంగభద్ర డ్యాం పరిధిలోని హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ కాలువలకు నీరు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. డ్యాంలో నీరు పూర్తిగా అడుగంటి పోవడంతో డ్యాంలో పలుచోట్ల బీటలు కనిపిస్తున్నాయి. 104 టీఎంసీలు నిల్వ ఉండే తుంగభద్ర డ్యాంలో నీరు ప్రస్తుతం కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో ఇక ఎట్టి పరిస్థితుల్లోను కాలువలకు నీరు వదిలే అవకాశమే లేకుండా పోయింది.
భగభగ మండే ఎండలకు తోడు డ్యాంలో నీరు ఖాళీకావడంతో నీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీస్కోవాల్సిన అవసరం ఉంది. తాగునీటి కోసం నిల్వ ఉంచుకున్న రిజర్వాయర్లలో నీరు వృథా చేయకుండా పద్థతి ప్రకారం వదిలితే వేసవిని గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయి. నిత్యం పర్యాటకుల సందడితో కనిపించే తుంగభద్ర డ్యాం వద్ద జన సందడి తగ్గిపోయింది. రెండు రాష్ట్రాలకు వరదాయినిగా ఉన్న తుంగభద్ర ఎండిపోవడంతో ఇక వరణుడు కరుణించే వరకు డ్యాంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు.