శేఖర్‌రెడ్డి కేసులో చేతులెత్తేసిన ఆర్‌బీఐ | Sakshi
Sakshi News home page

శేఖర్‌రెడ్డి కేసులో చేతులెత్తేసిన ఆర్‌బీఐ

Published Wed, Oct 25 2017 8:59 PM

No details of serial numer notes of 33.6 crores says RBI

సాక్షి, చెన్నై : ఆదాయపు పన్ను శాఖ చరిత్రలోనే సంచలనం రేకెత్తించిన తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్‌, టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి కేసులో ప్రతిష్టంభన నెలకొంది. పెద్ద నోట్లు రద్దయిన తరువాత కేవలం నెల రోజుల్లో రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ శేఖర్‌రెడ్డికి ఎలా వచ్చిందనే వివరాలపై రిజర్వు బ్యాంకు చేతులెత్తేయగా, ఈ చిక్కుముడిని ఛేదించలేక, చార్జిషీటు దాఖలు చేయలేక సీబీఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినట్లు గత ఏడాది నవంబరు 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి మోదీ అకస్మాత్తుగా ప్రకటించారు. వీటికి బదులుగా రిజర్వు బ్యాంకు కొత్తగా రూ.2వేలు, రూ.500 నోట్లను విడుదల చేఽసి బ్యాంకుల్లో పాత నోట్లు చెల్లించి కొత్త నోట్లను పొందే వెసులుబాటును పరిమితులతో కల్పించింది. అ సమయంలో కొందరు వ్యక్తులు బ్యాంకుల నుంచి అక్రమ మార్గంలో రూ.2000 కొత్త నోట్లను పొందినట్లు కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో ఆదాయపు పన్ను శాఖాధికారులు దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్‌ఆర్‌ఎస్‌ కంపెనీ పేరున తమిళనాడువ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో గత ఏడాది డిసెంబరు 8న ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా రూ.170 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 కొత్త నోట్లను అధికారులు గుర్తించారు.

సీబీఐకు విచారణ బాధ్యత
కేసు తీవ్రత దృష్ట్యా విచారణ బాధ్యతను సీబీఐ చేపట్టింది. పెద్ద నోట్ల రద్దు తరువాత కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఏ బ్యాంకు ద్వారా వచ్చాయని శేఖర్‌రెడ్డిని విచారించినా సరైన ఆధారాలు రాబట్టలేకపోయారు. ఒకే సీరియల్‌లో రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ శేఖర్‌రెడ్డికి ఎలా లభించిందని ఆర్‌బీఐనీ సీబీఐ ప్రశ్నించింది. కరెన్సీని ముద్రించే నాసిక్, మైసూర్‌ తదితర ప్రాంతాల నుంచి తమకు కొత్త నోట్లు చేరుతాయి.. వాటిని యథాతథంగా బ్యాంకులకు పంపుతాం.. సీరియల్‌ నంబర్లను రికార్డుల్లో నమోదు చేసే అలవాటు లేదు అని ఆర్‌బీఐ అధికారులు బదులిచ్చారు. సమస్యలు ప్రారంభమైన నాటినుంచి మాత్రమే సీరియల్‌ నంబర్లు నమోదు ప్రారంభించామని తెలిపారు. ఈ కారణంగా రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో వివరాలు ఇవ్వలేమని ఆర్‌బీఐ అధికారులు చేతులెత్తేశారు.

చార్జిషీటు దాఖలు చేయలేక అవస్థలు
అరెస్టు చేసిన 90 రోజుల్లో శేఖర్‌రెడ్డిపై చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. అయితే కీలకమైన ఆధారాలు దొరక్కపోవడంతో చార్జిషీటు దాఖలు చేయలేకపోయారు. రూ.33.6 కోట్ల కొత్త కరెన్సీ గురించి బ్యాంకులు, రిజర్వు బ్యాంకు వద్ద విచారణ కొనసాగుతున్నందున నిర్ణీత కాలంలో చార్జిషీటు దాఖలు చేయలేకపోయామని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి చెప్పుకున్నారు. దీంతో శేఖర్‌రెడ్డి తదితరులకు బెయిల్‌ మంజూరైంది. పట్టుబడిన నగదు, బంగారానికి పన్ను చెల్లించామని, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్సుగా రూ.31 కోట్లు చెల్లించామని, ఇదంతా నిబంధనలకు లోబడి వ్యాపారం ద్వారా ఆర్జించినదేనని శేఖర్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తున్నారు. సీరియల్‌ నంబర్ల చిక్కుముడి వీడితేగాని కేసు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement