
మెదడువాపు వ్యాధితో తమ పిల్లలను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులు ఆస్పత్రిని సందర్శించిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ముజఫర్‌పూర్/పట్నా: మెదడువాపు వ్యాధితో తమ పిల్లలను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులు ఆస్పత్రిని సందర్శించిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముజఫర్‌పూర్ జిల్లాలో ఇప్పటి వరకూ 100 మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధితో మరణించడం తెల్సిందే. వ్యాధి వ్యాప్తిపై పట్నాలో అధికారులతో భేటీ తర్వాత నితీశ్ ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రి ఐసీయూలోకి వెళ్లారు. దీంతో అక్కడ కొందరు ‘నితీశ్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
నితీశ్ ఐసీయూలోకి రాగానే పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మా బిడ్డలను కాపాడండి సారూ అంటూ భోరున విలపించారు. నితీశ్ వారిని పరామర్శించి బిడ్డల పరిస్థితిని గురించి డాక్టర్ల వద్ద వాకబు చేశారు. త్వరలోనే కృష్ణా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను 600 పడకల స్థాయి నుంచి 2,500 పడకల స్థాయికి చేరుస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ చెప్పారు.