రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఇటీవల తాగిన మైకంలో బీఎండబ్లూ కారు నడిపి ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఎమ్మెల్యే నందకిషోర్ మహారియా కుమారుడు సిద్ధార్థ్ మహారియా చుట్టూ పోలీసులు ఉచ్చు భిగించారు.
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఇటీవల తాగిన మైకంలో బీఎండబ్లూ కారు నడిపి ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఎమ్మెల్యే నందకిషోర్ మహారియా కుమారుడు సిద్ధార్థ్ మహారియా చుట్టూ పోలీసులు ఉచ్చు భిగించారు. ఓ ఆటోను బీఎండబ్యూ కారు ఢీకొన్నప్పుడు తన కుమారుడు కారును నడపడం లేదని, డ్రైవర్ నడిపాడని, తన కుమారుడికి మద్యం తాగే అలవాటే లేదని, పాలు తప్ప, మరోటి తాగడని, యాక్సిడెంట్ అయిన రాత్రి ఎదురుగా వచ్చిన ఆటోకు అసలు లైట్లు లేవంటూ తన కొడుకును రక్షించుకునేందుకు ఎమ్మెల్యే వేసిన ఎత్తులన్నీ పోలీసుల ముందు చిత్తయ్యాయి.
యాక్సిడెంట్ జరిగిన రోజున యాక్సిడెంట్‌కు ముందు సిద్ధార్థ్ మారియా ఓ బార్‌కు, రెండు హోటళ్లుకు వెళ్లాడని, వాటిల్లో మద్యం సేవించాడని ఆ బార్‌ను, హోటళ్ల నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజుల్లో స్పష్టమైంది. ముఖ్యంగా ఓ బార్‌లో కూర్చొని స్పానిష్ వైన్ సేవించినట్లు ఫుటేజ్‌లో తేలింది. కొసేకా బ్రాండ్‌కు చెందిన వైన్ సేవించినట్లు కూడా సీసీటీవీల్లో రికార్డయింది. అంతేకాదు మద్యం సేవించిన అనంతరం కారును సిద్ధార్థే నడపడం, ప్రమాదం అనంతరం కారులోని డ్రైవర్ సీటు నుంచి సిద్ధార్థ దిగడం కూడా వీధుల్లోని సీసీటీవీ కెమేరాలు బయటపెట్టాయి.
సీసీటీవీ ఫుటేజ్‌లతోపాటు బార్, హోటళ్లలో సిద్ధార్థ చెల్లించిన బిల్లులను కూడా జైపూర్ పోలీసులు సేకరించి సిద్ధార్థపై పగడ్బందిగా కేసును నమోదు చేశారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఆటో హెడ్‌లైట్లు లేకుండా దూసుకొచ్చింది అంటూ ఎమ్మెల్యే చేసిన వాదన కూడా వీగిపోయింది. పోలీసు దర్యాప్తులో ఆటో హెడ్‌లైట్లు పనిచేస్తున్నట్లు వెల్లడైంది.