
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడిన వారిని ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రుల్లో చేరుస్తున్నప్పటికీ వారికి కృత్రిమ శ్వాసను అందించేందుకు అవసరమైన ‘ఆక్సిజన్ వెంటిలేటర్ల’ కొరతను భారత్‌తోపాటు పలు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. అందరు కరోనా బాధితులకు బదులుగా అవసరమైన బాధితులకు మాత్రమే ఆక్సిజన్ వెంటిలేటర్లను అమర్చితే ఈ కొరత సమస్యే ఉండదు. అందుకు అనువుగా ఎవరికి వెంటిలేటర్లు అవసరమో, ఎవరికి అవసరం లేదో సులభంగా కనుగొనేందుకు వీలుగా రోగుల రక్తంలో ఓ ప్రొటీన్‌ను షికాగో వైద్య నిపుణులు కనుగొన్నారు.(కరోనా నిరోధక శక్తికి ‘నిద్ర’ ముఖ్యం)
రోగుల రక్తంలో ‘సుపార్’ అనే ప్రొటీన్ స్థాయి ఎక్కువ ఉన్నట్లయితే వారికి రోగం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లని, వారికి ఆక్సిజన్ వెంటిలేటర్లను అమర్చాల్సిన అవసరం ఉంటుందని వైద్య నిపుణులు తేల్చారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా లేని వారిలో సుపార్ ప్రొటీన్ స్థాయి 5ఎన్‌జీ–ఎంల్ ఉంటుందని, తీవ్రత ఎక్కువ ఉన్న వారిలో 6ఎన్‌జీ–ఎంఎల్, అంతకన్నా ఎక్కువ ఉంటుందని, ఎక్కువ ఉన్నవారందరికి వెంటిలేటర్లను అమర్చాల్సిన అవసరం ఉంటుందని అమెరికాలోనే నెంబర్ వన్ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన షికాగోలోని ‘రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్స్’ వైద్య నిపుణుల బృందం తెలిపింది. రోగ తీవ్రతనే కాకుండా రోగ నిరోధక శక్తికి సూచికగా సుపార్ ప్రొటీన్ పని చేస్తుందని, సుపార్ స్థాయి పెరిగినట్లయితే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి రోగ తీవ్రత పెరిగినట్లని ఆస్పత్రి ఇంటర్నల్ మెడిసిన్ చైర్ పర్సన్ డాక్టర్ జోచెన్ రిజైయిర్ తెలిపారు.(శాస్త్రి భవన్‌కు పాకిన కరోనా ప్రకంపనలు)