కశ్మీర్‌లో కేంద్ర పాలన తాత్కాలిమే.. | Narendra Modi Addresses The Nation Over Kashmir Issue | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో కేంద్ర పాలన తాత్కాలిమే..

Aug 8 2019 8:41 PM | Updated on Aug 8 2019 10:56 PM

Narendra Modi Addresses The Nation Over Kashmir Issue - Sakshi

న్యూఢిల్లీ : కశ్మీర్‌లో కేంద్రపాలన తాత్కాలిమేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాక కేంద్ర పాలన ఉండదని స్పష్టం చేశారు. త్వరలోనే కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, అంబేడ్కర్‌, వాజ్‌పేయి వంటి మహానీయుల కల నెరవేరిందన్నారు. కశ్మీర్‌ విభజన తరువాత ప్రధాని తొలిసారిగా గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమైందని పేర్కొన్న మోదీ.. కశ్మీర్‌, లదాఖ్‌ ప్రజలకు ఈ సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు.

ఆర్టికల్‌ 370 వల్ల కశ్మీర్‌, లదాఖ్‌ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇంతకాలం చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు ఒకటే భారత్‌- ఒకటే రాజ్యంగం అనే కల సాకరమైందన్నారు. ఆర్టికల్‌ 370 జమ్మూ కశ్మీర్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు. ఈ ఆర్టికల్‌ను అడ్డం పెట్టుకుని జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అన్యాయం వెనుక పాక్‌ హస్తం ఉందని విమర్శించారు. ఇకపై కశ్మీర్‌ అభివృద్ది పథంలో ప్రయాణిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు కశ్మీర్‌ పునర్‌ నిర్మాణంలో యువకుల పాత్రపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కశ్మీర్‌కు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. కశ్మీర్‌ ప్రజలు బక్రీద్‌ స్వేచ్ఛగా జరుపుకోవచ్చన్నారు. కశ్మీర్‌లో శాంతి ప్రక్రియ, విశ్వశాంతికి కొత్తమార్గం నిర్దేశించాలని ఆకాంక్షించారు.

కుటుంబ రాజకీయాలు, అవినీతి కోసమే ఆర్టికల్‌ 370
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్టికల్‌ 370,35ఏల వల్ల కశ్మీర్‌ ప్రజలకు ఒరిగిందేమీలేదు. కశ్మీర్‌లోని పిల్లలకు కనీసం చదువు కూడా అందలేదు. కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగింది.  ఆడబిడ్డలకు సమాన అవకాశాలకు దూరయ్యారు. ఆర్టికల్‌ 370ని పాకిస్తాన్‌ ఆయుధంలా వాడుకుంది. 42,000 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా ప్రయోజనం చేకూర్చే చట్టాలు కశ్మీర్‌ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఆర్టికల్‌ 370 ఉగ్రవాదాన్ని పోత్సహించడమే కాకుండా, కుటుంబ రాజకీయాలకు, అవినీతికి తోడ్పడింది. కశ్మీర్‌కు సాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కశ్మీర్‌లో కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదు. మైనార్టీలకు రక్షణ కల్పించే చట్టాలు అక్కడ ఉండవు. దేశమంతా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి. కానీ కశ్మీర్‌లో ఇవేమీ ఉండవు. కానీ ఇకపై.. దేశ అభ్యున్నతి కోసం చేసే చట్టాలు ఇకపై కశ్మీర్‌లో కూడా వర్తిస్తాయి. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశాం.

కొత్త నాయకత్వం ఉద్భవిస్తుంది..
విద్యాహక్కు చట్టం దేశమంతా అమలైంది.. కానీ కశ్మీర్‌లో కాలేదు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, మైనారిటీల రక్షణ కోసం చట్టం  ఉన్నాయి.. కానీ కశ్మీర్‌లో ఇవేమీ లేవు. ఇంతకాలం పడిన వేదన నుంచి కశ్మీరీలకు సమానత్వం లభిస్తుంది. కశ్మీర్‌ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారదర్శకత, కొత్త పని విధానం కశ్మీర్‌, లదాఖ్‌లలో అభివృద్ధికి బాటలు వేస్తుంది. కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు కశ్మీర్‌కు వస్తాయి. ఇంతకాలం కశ్మీర్‌ యువత చాలా హక్కులను కోల్పోయింది. ఇకపై కశ్మీర్‌లో కొత్త నాయకత్వం ఉద్భవిస్తుంది. ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికలు తప్ప.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లభించలేదు. కశ్మీర్‌ యువత నుంచి కొత్త నాయకులు పుట్టుకొస్తారు. కొత్త ఎమ్మెల్యేలను, సీఎంలను మనం చూస్తాం.

కశ్మీర్‌లో మళ్లీ షూటింగ్‌లు జరగాలి..
క్రీడారంగంలోను కశ్మీర్‌ దూసుకుపోయేలా చేస్తాం. జమ్మూకశ్మీర్‌లో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. పర్యాటక రంగంలో కశ్మీర్‌ను అత్యున్నతస్థాయిలో నిలబెడతాం. కశ్మీర్‌లో మళ్లీ షూటింగ్‌లు జరగాలి. హిందీ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు షూటింగ్‌ల కోసం కశ్మీర్‌కు రావాలి. కశ్మీర్‌ కళాకారుల ఉత్పత్తులను, లదాఖ్‌ సేంద్రీయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు అందజేయాలి. సౌర విద్యుత్‌కు లదాఖ్‌ ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ  సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అనేక అవకాశాలు ఉన్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉండేవారికి లదాఖ్‌లో దొరికే ఒక మూలిక సంజీవని లాంటిది.కశ్మీర్‌లో ఎకో టూరిజం, అడ్వెంచర్‌ టూరిజం, స్పిరిచువల్‌ టూరిజంను అభివృద్ధి చేయనున్నట్టు’ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement