దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి.
చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. చెన్నైలోని అళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ ముగిసింది. ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్, జీవ, గౌతమి, సంగీత, కుష్బూ, సుహాసిని, విజయ్లతోపాటు చలన చిత్రారంగానికి చెందిన పలువురు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏ సమయంలోనైనా ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. ఈసారి కూడా ఆ బృందమే మళ్లీ పగ్గాలు చేపట్టాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం కూడా పోటీకి దిగడంతో ఎన్నికలు అనివార్యమైనాయి. అటు శరత్కుమార్ వర్గం... విశాల్ వర్గం ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగడంతో సామరస్యంగా జరగాల్సిన ఈ ఎన్నికలు హోరాహోరిగా మారాయి. ఈ రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొంది.
దాంతో నడిగర్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఓ విధంగా చెప్పాలంటే సీనియర్, జూనియర్ నటుల మధ్య పోటీగా మారింది. హీరో విశాల్పై శరత్కుమార్ వర్గీయులు ఆదివారం ఉదయం దాడి చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయమైంది. నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై దాడికి పాల్పడుతున్నారని విశాల్ ఆరోపించారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శరత్కుమార్ వర్గానికి మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం.
ఈ ఎన్నికల్లో రజనీ తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. విజేతలు హామీలు నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేయాలని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పూర్తవగానే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పద్మనాభన్ ప్రకటిస్తారు.