తాము శనిఆలయంలోకి ప్రవేశించి తీరుతామని శనిశింగాపూర్లో పలువురు మహిళలు ఇప్పటికే ఉద్యమిస్తుండగా.. అదే బాటలో ముస్లిం మహిళలు కదిలారు.
న్యూఢిల్లీ: తాము శనిఆలయంలోకి ప్రవేశించి తీరుతామని శనిశింగాపూర్లో పలువురు మహిళలు ఇప్పటికే ఉద్యమిస్తుండగా.. అదే బాటలో ముస్లిం మహిళలు కదిలారు. తమను దర్గాలోకి అనుమతించాలంటూ ఆందోళన ప్రారంభించారు. ముంబయిలోని హజీ అలీ దర్గాలోకి తమకు ప్రవేశ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జీనత్ షాకత్ అలీ అనే ముస్లిం మహిళ మాట్లాడుతూ తమను దర్గాలోకి రానివ్వకుండా అడ్డుకోవడం వెనుక పితృస్వామ్య ఆధిపత్యం ఉందని, మతపరమైన పరిమితులు తమకు లేవని చెప్పారు. తమకు నిషేధం విధించాలని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదని అన్నారు. రాజ్యాంగం తమకు అన్ని హక్కులను ఇచ్చిందని, ఇస్లాం రాజ్యాంగాన్ని అంగీకరిస్తుందని తెలిపారు. 'నేను ఒక ముస్లింనే, దర్గాల్లోకి, స్మశానాల్లోకి ప్రవేశించకూడదని ఇస్లాం మతంలో ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ పితృస్వామ్య నియంతృత్వ పోకడలు' అని ఆమె ఆరోపించారు. ఇటు ముస్లింలలో, అటు హిందువులలో వారి ఆధిపత్యమే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.