జాట్ ఆందోళనలో అత్యాచారాలు నిజమే!

జాట్ ఆందోళనలో అత్యాచారాలు నిజమే!


హరియాణాలో ప్రకంపనలు రేపిన జాట్‌ ఆందోళనలో సామూహిక అత్యాచారాలు జరిగాయన్న విషయం తాజాగా వెలుగులోకి వస్తోంది. ఈ ఆరోపణలు వాస్తవం అనడానికి సరికొత్తగా ఆధారాలు సైతం లభించాయి. అక్కడ కనీసం 10మంది మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందని  ఓ జాతీయ పత్రిక గట్టిగా వాదిస్తోంది.  సంఘటన జరిగిందని చెబుతున్న ప్రదేశంలో మహిళల లోదుస్తులు దొరికాయని,  తమ ప్రతినిధులు స్వయంగా ముర్తల్ ప్రాంతాన్ని పరిశీలించినపుడు వీటిని గమనించారని పేర్కొంటోంది. జాతీయరహదారిపై దీనికి సంబంధించిన సాక్ష్యాలను తమ బృందం చూసిందని పేర్కొంటోంది. జాట్ ఆందోళనకారులు తగులబెట్టిన వాహనాల విడిభాగాలతో పాటు మహిళల దుస్తులు కూడా పడి ఉన్నాయని  చెబుతోంది.



మరోవైపు హరియాణాలోని ముర్తాల్‌ గ్రామంలో సామూహిక అత్యాచారాలపై పత్రికల్లో వచ్చిన కథనాల మీద పంజాబ్‌, హరియాణా హైకోర్టు సుమోటోగా స్పందించింది. అలాంటి నేరం జరిగి ఉంటే బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదుచేయాలని కోరింది. అటు హరియాణాకు చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారులతో పాటు జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు విచారణ చేపట్టారు. కమిషన్ ప్రతినిధి రేఖా శర్మ ముర్తల్ ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా,పోలీసు యంత్రాగాన్ని,  గ్రామ పెద్దలు, రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించారు. కానీ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం లభించలేదు. అటు ముర్తాల్‌లో పేరొందిన దాబా యజమాని అమ్రిక్‌ సింగ్‌నూ విచారణ అధికారులు ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన వార్తలనే తాను విన్నానని ఆయన చెప్పారు. అత్యాచార ఘటన చోటుచేసుకోలేదన్నారు.


అయితే ఇప్పటివరకు అత్యాచార ఘటనపై ప్రత్యక్ష సాక్షులు లేదా బాధితులు ఎవరూ తమ ముందుకు రాలేదని విచారణ అధికారులు చెబుతున్నారు. వార్తాపత్రికల్లో పేర్కొన్న ప్రత్యక్ష సాక్షులతో ఐజీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మాట్లాడారని అయితే అలాంటి సంఘటనలేమీ జరగలేదని వారు చెప్పారని  రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.




కాగా  హరియాణా నుంచి ఢిల్లీకి తిరిగివస్తుండగా దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ది ట్రిబ్యూన్‌ వార్తాపత్రిక పేర్కొంది. సోనిపట్‌ సమీపంలోని ముర్తాల్‌ వద్ద కార్లను ఆపిన దాదాపు 30 మంది  దుండగులు,  మహిళలను సమీప పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వార్తలొచ్చాయి. రేప్‌ బాధితులను సమీప గ్రామాలకు చెందిన హసనపూర్‌, కురాద్‌ ప్రజలు ఆశ్రయం ఇచ్చి కాపాడారని కూడా ఆ పత్రిక కథనం పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top