మిస్టర్‌ దళిత్‌.. మీసం మెలేస్తోన్న యువత | Mr Dalit : Gujarath dalith youth protest | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ దళిత్‌.. మీసం మెలేస్తోన్న యువత

Oct 4 2017 4:34 PM | Updated on Oct 4 2017 4:38 PM

Mr Dalit : Gujarath dalith youth protest

గాంధీనగర్‌ : గుజరాత్‌లో తమపై వరుసగా జరుగుతోన్న దాడులను గర్హిస్తూ దళిత యువత వినూత్న నిరసనలు చేపట్టింది. ‘దళితులు మీసం మెలితిప్పరాద’న్న పాటిదార్‌(పటేల్‌), రాజ్‌పుత్‌(రాజపుత్ర) కులస్తుల హెచ్చరికలను సవాలు చేస్తూ  సామూహికంగా మీసం మెలేస్తూ, ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. గాంధీనగర్‌ జిల్లా లింబోదరాలో మొదలైన నిరసన క్రమంగా విస్తరించింది.

అసలేం జరిగింది? : కలోల్ తాలూకా లింబోదర గ్రామంలో కృనాల్ మహేరియా(30) అనే న్యాయశాస్త్ర విద్యార్థి.. రాజ్‌పుత్‌ కులస్తుల ముందు మీసం మెలేశాడన్న కారణంగా దాడికి గురయ్యాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడు కృణాల్‌.. గత ఆదివారం కలోల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రాజ్‌పుత్‌ యువకులపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు కూడా నమోదైంది. ఈ విషయంలో కక్ష పెంచుకున్న రాజ్‌పుత్‌ యువకులు.. కృనాల్‌ సోదరుడు దిగంత్‌ మహేరియా(17)పై మంగళవారం(అక్టోబర్‌ 3) సాయంత్రం దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్‌ వచ్చి, దిగంత్‌ వీపుపై కత్తితో గాట్లుపెట్టారు. అంతకు ముందే ఆనంద్‌ జిల్లా భద్రనియా గ్రామంలో పాటిదార్‌(పటేల్‌) కులానికి చెందిన మహిళలు గర్భా నృత్యాలు ఆడుతుండగా.. అటుకేసి చూస్తూ మీసం మెలేశాడన్న కారణంగా జయేశ్‌ సోలంకి(21) అనే దళిత యువకుడిని  పాటీదార్‌ యువకులు చితకబాదారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. మీసం మెలివేసినంత మాత్రనికే తమపై అగ్రవర్ణాలు దాడిచేయడాన్ని దళితులు గర్హిస్తున్నారు.

మిస్టర్‌ దళిత్‌ : ఏ మీసం మెలేసినందుకు తమపై అగ్రకులాలు దాడి చేశాయో.. అదే మీసం మెలేస్తూ దళితులు నిరసనకు దిగారు. ‘మిస్టర్‌ దళిత్‌’ ట్యాగ్‌తో మీసం మెలేస్తూ ఫొటోలను, ‘ఎన్ని దాడులు చేసినా.. మీసం మెలేస్తూనే ఉంటాం..’ అనే సందేశాలను పోస్టు చేస్తున్నారు. అకారణంగా తమవారిపై దాడిచేసినవారిని అరెస్టు చేయాలంటూ దళిత కుటుంబాలు పోలీసులను డిమాండ్‌ చేశాయి. దాడులకు సంబంధించి ఆయా పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement