కోర్టుల్లో నడుస్తున్న కేసులపై మీడియా సమాంతరంగా విచారణలు జరపడం సరికాదని కేంద్ర సమాచార , ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆక్షేపించారు.
న్యూఢిల్లీ: కోర్టుల్లో నడుస్తున్న కేసులపై మీడియా సమాంతరంగా విచారణలు జరపడం సరికాదని కేంద్ర సమాచార , ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆక్షేపించారు. ‘ప్రముఖుల కేసుల్లో దోషి ఎవరో, నిర్దోషి ఎవరో మీడియా ప్రకటించేస్తుండడంతో కోర్టులు చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. దురభిప్రాయాలకు తావిచ్చే ఈ విచారణలపై మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసుపై మీడియాలో పలు కథనాలు వస్తున్న నేపథ్యంలో జైట్లీ పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఆయన ఆదివారమిక్కడ జస్టిస్ జేఎస్ వర్మ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘మీడియా స్వేచ్ఛ, బాధ్యత’ అంశంపై స్మారకోపన్యాసం చేశారు. మీడియా భార్యాభర్తల సంబంధాలను గౌరవించాలన్నారు. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లకు సంబంధించి మీడియా కవరేజీకి ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించనున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోందన్నారు.
‘26/11’ ముంబై దాడుల ప్రత్యక్ష ప్రసారం వల్ల ఉగ్రవాదుల నాయకులకు భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయో తెలిసిందని నిఘా సంస్థలు చెప్పాయన్నారు. ఇలాంటి వాటిని ఏమాత్రం అనుమతించకూడదని భద్రతా సంస్థలు, రక్షణ శాఖ భావిస్తున్నాయని పేర్కొన్నారు. కవరేజీపై గట్టి నియంత్రణ ఉండాలన్నారు.