మరాఠాలకు ‘మహా’ వరాలు

Maharashtra government offers sops to Maratha youths - Sakshi

బ్యాంకుల రుణాలకు గ్యారెంటీగా ఉంటామని హామీ

రిజర్వేషన్‌ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం

ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోసం ఆందోళన చేస్తున్న మరాఠాలను శాంతింపజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. మరాఠా యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉండనుంది. ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్‌ అందించనుంది. మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్‌ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్‌ సబ్‌కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

మరాఠా యువతకు బ్యాంకులు రుణాలకు సంబంధించి అన్నాభూ సాథే ఫైనాన్షియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పథకం కింద బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.8 లక్షలు దాటని మరాఠా సామాజికవర్గం పిల్లలు వృత్తివిద్యా కోర్సుల్లో చేరితే ఫీజులో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక    మంత్రి పాటిల్‌ తెలిపారు. ఈ జాబితాలో 608 వృత్తివిద్యా కోర్సుల్ని చేర్చినట్లు వెల్లడించారు.  విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కోసం మరాఠాలు గత 11 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మరాఠాలను మోసం చేయాలనుకోవట్లేదు
దుందుడుకుగా లోపభూయిష్టమైన రిజర్వేషన్‌ చట్టాన్ని తీసుకొచ్చి తమ ప్రభుత్వం మరాఠాలను మోసం చేయాలనుకోవడం లేదని ఆర్థికమంత్రి సుధీర్‌ తెలిపారు. దీనివల్ల ఆయా చట్టాలను కోర్టులు కొట్టేసే అవకాశం ఉందన్నారు. మరాఠాల రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేయలేని విధంగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top