కస్టడీ డెత్‌: మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Madras HC Says Enough Evidence of Assault on Bodies TN Custodial Death - Sakshi

చెన్నై: జ్యుడిషియల్‌ కస్టడీలో మృతి చెందిన జయరాజ్‌, బెనిక్స్‌లపై హేయమైన దాడి జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు రుజువైందని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘తండ్రీకొడుకులపై దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు లభించాయి’’అని మంగళవారం పేర్కొంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్‌(59), బెనిక్స్‌(31) పోలీసు కస్టడీలో ఒకరి తర్వాత ఒకరు మరణించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో వారిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేయగా... గాయాలతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!)

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేయగా... మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారి అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం... జయరాజ్‌, బెనిక్స్‌ల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్‌ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ పీఎన్‌ ప్రకాశ్‌, జస్టిస్‌ పుగళేందిలతో కూడిన ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను మంగళవారం పరిశీలించింది. బాధితుల మృతదేహాలపై గాయాలు ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొంది. (పోలీసులు కావాల‌నే దాడికి దిగారు)

ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించే విషయం గురించి న్యాయమూర్తులు మాట్లాడుతూ..‘‘వారికి న్యాయం జరుగుతుందని జయరాం కుటుంబం నమ్ముతోంది. ఒక్క సెకన్‌ కూడా వృథా కావడానికి వీల్లేదు. సీబీఐ ఈ కేసును చేపట్టే లోపు తిరునల్వేలి డీఐజీ ఎందుకు విచారణ ప్రారంభించకూడదు’’అంటూ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఈ విషయంపై మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా ఈ కేసు విచారణకై నియమించిన జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ విషయంపై సంబంధిత జ్యుడిషియల్‌ పరిధిలోని అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర అధికారులు 4 వారాల్లోగా స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేయగా, మరో పదిహేను మందిని బదిలీ చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top