బిహార్‌, యూపీలో పిడుగుల బీభత్సం

Lightning Kills 31 In UP And Bihar Also Flood Claims 1 In Assam - Sakshi

పాట్నా: బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో గురువారం ఒక్కరోజే పిడుగుపాటుకు గురై దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా అసోంలో వరదల కారణంగా మరొకరు మృతి చెందారు. పంటపొలాలన్నీ నీటిలో మునిగాయి. మరోవైపు ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వాతావరణ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో తీవ్ర వేడి ఉండగా  రాబోయే రెండు రోజులు నగరంలో ఇదే పరిస్థితి ఉంటుందని, వారాంతంలో వర్షాలు పడే సూచన ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీలోని చాలా ప్రదేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదైంది. (త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు)

బిహార్‌లో గురువారం 26 మంది పిడుగుల దాడికి మృతిచెందినట్లు, అధికారులు వెల్లడించారు. గతవారం కూడా రాష్ట్రంలో పిడుగుల తాకిడికి 100 మందికి పైగా మరణించారు. పాట్నా, సమస్తిపూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, షియోహార్, కతిహార్, మాధేపుర, పూర్నియా వంటి ఎనిమిది జిల్లాల నుంచి ప్రాణ నష్టం జరిగినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఇక ఈ ఘటనపై స్పందించిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే పిడుగుల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వీటి మొత్తాన్ని వీలైనంత తర్వగా బాధితులకు అందించాలని అధికారులను ఆదేశించారు. (పిడుగుపాటుకు గురై 22 మంది మృతి)

కాగా పొరుగున ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పిడుగుల ప్రభావానికి అయిదుగురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. అస్సాంలో గురువారం తీవ్ర వరద ఉధృతి మరో ప్రాణాన్ని బలితీసుకుంది. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 34 మందికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 72,700 హెక్టార్ల విస్తీర్ణంలోని పంట పూర్తిగా నీట మునిగింది. ఇదిలావుండగా ముంబై పరిసర తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం అంచనా వేసింది. రాబోయే రెండు రోజులు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top