'పొత్తుకైనా.. విలీనానికైనా సిద్ధమే' | Lalu wants Nitish to hasten alliance talks | Sakshi
Sakshi News home page

'పొత్తుకైనా.. విలీనానికైనా సిద్ధమే'

Jun 2 2015 2:25 AM | Updated on Sep 3 2017 3:03 AM

'పొత్తుకైనా.. విలీనానికైనా సిద్ధమే'

'పొత్తుకైనా.. విలీనానికైనా సిద్ధమే'

జేడీయూతో పొత్తుకైనా, విలీనానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు.

పట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీని ఓడించే లక్ష్యంతో ఏకమవ్వాలనుకుంటున్న లౌకిక పార్టీలు ఆ దిశగా అడుగులు  వేస్తున్నాయి. ఒకవైపు జేడీయూ సహా లౌకికవాద పార్టీలతో పొత్తుకైనా, జేడీయూతో విలీనానికైనా సిద్ధమేనని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సోమవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నందువల్ల.. జనతా పరివార్ మహా కూటమి ఏర్పాటుపై తొందరపడాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, జనతా పరివార్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించిన బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్.. కొంత సమయం తీసుకున్నప్పటికీ జనతా పార్టీల విలీనం జరుగుతుందన్నారు.  రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఇంకోవైపు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన బిహార్ పీసీసీ చీఫ్ అశోక్ చౌధరి.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి లౌకికవాద పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

 తొందరపడాలి.. జనతా పరివార్‌పై రకరకాల వార్తలు వినిపిస్తుండటం విలీన వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తోందని లాలూ  ఆందోళన వ్యక్తం చేశారు. జనతా పరివార్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నితీశ్‌కుమార్‌పైనే ఉందని తేల్చి చెప్పారు. ‘నితీశ్‌తో వారంక్రితం మాట్లాడాను. సమయం మించిపోతోందని, ఎన్నికల పొత్తు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై త్వరగా కూచుని మాట్లాడుకోవాల్సి ఉందని చెప్పాను. మన విలీనం, పొత్తునకు సంబంధించి బయట వినవస్తున్న రకరకాల వార్తలు వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తున్నాయని వివరించాను. కంటి సమస్యతో ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతున్నందువల్ల నితీశ్ దీనిపై వెంటనే స్పందించలేక పోయాడు’ అని లాలు సోమవారం విలేకరులతో అన్నారు. ‘విలీనమే మీరు కోరుకుంటున్నట్లయితే.. మేం అందుకు కూడా సిద్ధమే. ఈ రోజే కూర్చుని సీఎం అభ్యర్థి ఎవరనే విషయం సహా అన్ని విషయాలపై మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వద్దాం’ అని జేడీయూకి ప్రతిపాదించారు. జనతా పరివార్‌లో భాగంగా ఆర్జేడీ, జేడీయూల పొత్తు లేదా విలీనానికి సంబంధించి.. రానున్న ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే విషయమే ప్రధాన అడ్డంకిగా మారింది. నితీశ్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న జేడీయూ ప్రతిపాదనను లాలూ  తిరస్కరిస్తున్నారు. అలాగే, నితీశ్‌కు కంట్లో నలుసుగా మారిన మాజీ  సీఎం మాంఝీని తమ లౌకికవాద కూటమిలో చేరాలంటూ లాలు ఆహ్వానించడం జేడీయూకు ఆగ్రహం తెప్పించింది.

Advertisement
 
Advertisement
Advertisement