‘బిహార్‌’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్ | Bihar Drubbing Effect Prashant Kishor Shifts to Patna Ashram | Sakshi
Sakshi News home page

‘బిహార్‌’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్

May 21 2026 1:21 PM | Updated on May 21 2026 1:38 PM

Bihar Drubbing Effect Prashant Kishor Shifts to Patna Ashram

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దరిమిలా రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌ను కొత్త నిర్ణయం తీసుకున్నారు. పట్నాలోని విలాసవంతమైన బంగ్లాను వదిలి,  ఒక ఆశ్రమానికి తన నివాసాన్ని మార్చారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.

షేక్‌పురా హౌస్ ఖాళీ.. ఆశ్రమంలోనే బస
దర్భంగాలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ తాను పట్నాలోని పాత నివాసాన్ని ఖాళీ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఐఐటీ పట్నాకు సమీపంలో ఉన్న ‘బిహార్ నవనిర్మాణ ఆశ్రమం’ ఇకపై తన నివాసమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ తన ముద్ర వేసేంత వరకు, అంటే తదుపరి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాను ఈ ఆశ్రమంలోనే ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇంతకాలం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ‘షేక్‌పురా హౌస్’ బంగ్లా నుండి కార్యకలాపాలు సాగించారు.

ఘోర పరాజయం.. నితీష్‌పై తీవ్ర విమర్శలు
ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఘోర పరాభవం తర్వాత పీకే రూట్ మార్చారు. ఇదే సమయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ కుమారుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కావడంపై మండిపడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజల వలసలను ఆపలేని ముఖ్యమంత్రి, తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు మాత్రం గట్టి పునాది వేసుకున్నారని పీకే ఎద్దేవా చేశారు.

ఓటర్లకు పిలుపు.. రూ.10 వేల పథకంపై ఎటాక్
కుల మతాలకు, డబ్బు ఆశలకు లొంగకుండా ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ వంటి నాయకుల మాటలకు మోసపోవద్దన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద సుమారు 1.5 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేసిన రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని ఉద్దేశిస్తూ.. కేవలం పదివేల రూపాయల కోసం ఓట్లను అమ్ముకోవద్దని పీకే ఓటర్లను హెచ్చరించారు.

 ఇది కూడా చదవండి: ‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్!

Advertisement
 
Advertisement
Advertisement