‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్! | Rahul Gandhi Shares Childhood Photo in Emotional Tribute to Rajiv Gandhi | Sakshi
Sakshi News home page

‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్!

May 21 2026 12:35 PM | Updated on May 28 2026 11:42 AM

Rahul Gandhi Shares Childhood Photo in Emotional Tribute to Rajiv Gandhi

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తండ్రికి అత్యంత భావోద్వేగ భరిత నివాళులర్పించారు. గురువారం (మే 21, 2026) నాడు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా తన చిన్ననాటి అరుదైన ఫోటోను పంచుకుంటూ పెట్టిన పోస్ట్  వైరల్‌గా మారింది. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాహుల్ ప్రతిజ్ఞ చేశారు.

వీర్ భూమి వద్ద కుటుంబ సభ్యుల నివాళులు
రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం ‘వీర్ భూమి’ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పిల్లలు మిరాయా, రైహాన్ వాద్రాలతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్, పి. చిదంబరం, భూపిందర్ సింగ్ హుడా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘ఎక్స్‌’ ద్వారా మాజీ ప్రధానికి  నివాళులు అర్పించారు.

 


నాన్న నేర్పిన సంస్కారమే నా ఊపిరి: రాహుల్
తండ్రితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ హిందీలో ఒక హృదయపూర్వక సందేశాన్ని రాశారు. ‘నాన్నా.. మీరు కలలు గన్న నైపుణ్యం, సంపన్నతతో కూడిన  బలమైన భారతదేశాన్ని నిర్మించే బాధ్యతను నేను పూర్తిగా భుజానికెత్తుకుంటాను. మీరు నేర్పిన పాఠాలు, మీ సంస్కారం, మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి’ అని రాహుల్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ తండ్రీకొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

 

నవ భారత నిర్మాతకు ప్రముఖుల ప్రశంసలు
కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే రాజీవ్ గాంధీని ‘భారతదేశ అద్భుత పుత్రుడు’గా అభివర్ణించారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, దేశంలో టెలికాం, సమాచార సాంకేతిక విప్లవానికి పునాది వేయడం వంటి సంస్కరణలను ఆయన గుర్తుచేశారు. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఆ కాలంలోనే 21వ శతాబ్దం గురించి మాట్లాడిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో 40 ఏళ్ల వయసులో దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ, మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement