
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కోల్‌కత: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కత నౌకాశ్రయానికి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. నేతాజీ స్టేడియంలో జరిగిన కోల్‌కత నౌకాశ్రయ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం ఆలోచనకు అంకురార్పణ చేసిన గొప్ప నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ప్రధాని కొనియాడారు. సత్యాగ్రహం నుంచి స్వచ్చాగ్రహం (స్వచ్ఛ భారత్) వరకు ఎన్నో అనుభూతులకు కోల్‌కత పోర్టు వేదికైందని గుర్తు చేశారు. ఎందరో వ్యాపారస్తులు, గొప్ప గొప్ప నాయకులు పోర్టు సేవలను పొందారని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరవడం గమనార్హం. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాందవియా తదితరులు హాజరయ్యారు.