పాప కోసం .. ముగ్గురు తండ్రుల పంచాయతీ..!!

Kolkata Hospital 3 Men Claiming To Be Newborn Father - Sakshi

ఒక మహిళకు భర్తలుగా చెప్పుకున్న ముగ్గురు వ్యక్తులు

మహిళ స్టేట్‌మెంట్‌తో కొలిక్కి వచ్చిన వ్యవహారం

కోల్‌కతా: నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ ఆడబిడ్డకు ‘తండ్రిని నేనే’ అంటూ ముగ్గురు వ్యక్తులు ముందుకొచ్చారు. శిశువు తల్లిని తానే భర్తనని ముగ్గురూ ప్రకటించుకున్నారు. వివరాలు.. నెలలు నిండటంతో శనివారం రాత్రి ఓ గర్భిణీ (21) నగరంలోని ఐఆర్‌ఐఎస్‌ ఆస్పత్రిలో చేరారు. ఆమెతో పాటు ఒక పురుషుడు, ఒక మహిళ కూడా ఉన్నారు. సదరు మహిళను డెలివరీ కోసం ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఇంతవరకూ బాగానే సాఫీగా ఉంది.

కానీ, ఇంతలో ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. డెలివరీ కోసం వెళ్లిన మహిళ తన భార్య అని.. ఆమెను కలుసుకోవాలని చెప్పడంతో ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతైంది. ఎందుకంటే, మహిళతో పాటు వచ్చిన వ్యక్తి... ఆమె భర్తగా చెప్పుకున్నాడు. ఆపరేషన్‌ ఫారంలలో సంతకం కూడా చేశాడు. ఇదే విషయం రెండో వ్యక్తికి చెప్పారు. అంతేగాక, అతన్ని మహిళ కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్ళి విషయం చెప్పారు. ఇద్దరూ ఆ గర్భిణీ భర్తలేనంటూ వారు సమాధానమివ్వడంతో సిబ్బం‍ది మరోమారు ఆశ్చర్యపోక తప్పలేదు. ఇదిలాఉండగా.. ఆమె ఇద్దరు భర్తల మధ్య అసలు భర్తను నేనంటే నేనంటూ తన్నులాట మొదలైంది. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ లోపు ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న మహిళ పండంటి ఆడశిశువుకు జన్మనివ్వడం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి.

మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ ఉన్నా..
పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. విచారణ ప్రారంభించారు. సదరు మహిళతో వివాహం అయినట్లు ఆధారాలు చూపించమన్నారు పోలీసులు. దాంతో రెండో వ్యక్తి ఇంటికి వెళ్లి మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ తీసుకువచ్చి పోలీసులకు చూపించాడు. ఈ పరిణామంతో మొదటి వ్యక్తి దారిలోకి వచ్చాడు. తాను సదరు మహిళకు కేవలం స్నేహితుడినని తెలిపాడు. హమ్మయ్యా సమస్య పరిష్కారం అయ్యిందనుకొంటుండగా.. మరో సమస్య వచ్చిపడింది. ఇంతలో మహిళ తల్లి... రెండో వ్యక్తిని తన అల్లుడిగా నిరాకరించింది. దాంతో పోలీసులు మహిళ స్పృహలోకి వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించి ఎదురు చూడసాగారు. ఈ లోపు కొత్త సమస్య ఎదురైంది. ఇద్దరిలో ఎవరు అసలు భర్తో తెలియని తికమక వాతావరణంలో ఇంకో వ్యక్తి వచ్చి పుట్టిన బిడ్డకు తానే తండ్రినని మరో బాంబు పేల్చాడు.

భర్తను కాదు.. తండ్రిని
ఈ సారి తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. సదరు మహిళకు తాను భర్తను కాదని, పుట్టిన బిడ్డకు మాత్రం తండ్రిని తానేనని మూడో వ్యక్తి వాదులాట మొదలెట్టాడు. ఈ పంచాయితీ పోలీసులకు సవాల్‌గా మారింది. మహిళ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేస్తే తప్ప ఈ డ్రామాకు శుభం కార్డు పడేలా కనిపించలేదు. ఈ లోపు మహిళకు స్పృహ రావడంతో.. ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. జరిగిన విషయాలన్నీ చెప్పారు. తన నిజమైన భర్త ఎవరో చెప్పాల్సిందిగా కోరారు. ఆమె ఏ మాత్రం కంగారు పడకుండా మ్యారేజ్‌ సర్టిఫికేట్‌తో వచ్చిన రెండో వ్యక్తే తనకు భర్త అని వెల్లడించింది. అతనే తన బిడ్డకు తండ్రి అని తేల్చింది.

అసలు విషయం ఏంటంటే..
మరి సదరు మహిళ తల్లి రెండో వ్యక్తిని తన అల్లుడిగా అంగీకరించకపోవడం గురించి ప్రశ్నించారు పోలీసులు. అందుకు మహిళ సమాధానమిస్తూ.. ‘మా ఇద్దరికి తొలుత ఓ క్లబ్‌లో పరిచయమైంది. ప్రేమించుకున్నాం. ఈ లోపు నేను గర్భవతిని అయ్యాను. పెళ్లి గురించి అడిగితే.. తప్పించుకోవాలని చూశాడు. దాంతో అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలీసుల జోక్యంతో మా వివాహం జరిగింది. అయితే మా వివాహాన్ని రెండు కుటుంబాలు అంగీకరించలేదు. దాంతో మేం వారి నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నాం. ఆ కోపంతో మా అమ్మ నా భర్తను తన అల్లుడిగా ఒప్పుకోలేదు’ అని తెలిపింది. చివరకు ఈ  కథ ఇలా సుఖాంతం అయ్యింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top