లాక్‌డౌన్‌ కచ్చితంగా పొడిగిస్తాం

Kishan Reddy Comments On Lockdown - Sakshi

ప్రజలు సిద్ధం కావాలి 

మరింత కఠినంగా అమలు చేస్తాం 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కచ్చితంగా పొడిగిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రముఖులు పలు సూచనలు చేశారు. వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో, రెడ్‌ జోన్లలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని చెబుతున్నారు. కేంద్రం కూడా అదే దృక్పథంతో ఉంది. కరోనాను అరికట్టాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది. దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.

కరోనా బారిన పడి చనిపోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ పూర్తి స్థాయిలో ఎత్తివేయడం సాధ్యం కాదు. కచ్చితంగా దీనిని పొడిగిస్తాం. పొడిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు దీనికి మానసికంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రాణాలు, కుటుంబ సభ్యుల ప్రాణాలు, దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈ కఠిన పరిస్థితులు అర్థం చేసుకోవాలి. లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. రెడ్‌ జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. గ్రీన్‌ జోన్లలో ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చాం. ప్రజా రవాణా, మాల్స్, థియేటర్లు వంటివి తప్ప దాదాపు అన్నింటికి అనుమతి ఇచ్చాం..’అని పేర్కొన్నారు.  

మే 3 తరువాత సడలింపులు.. 
‘గ్రీన్‌ జోన్‌లో మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రులు కూడా ఇవే సూచనలు చేశారు. దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని మోదీ మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. గ్రీన్‌ జోన్లలో మరిన్ని వెసులుబాట్లు కల్పించే ప్రయత్నం చేస్తారు. విమానాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజారవాణా వసతి మాత్రం ఇప్పుడే ప్రారంభించే పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. పూర్తి నిర్ణయం వచ్చాక తెలుస్తుంది. ప్రయాణికులు, విద్యార్థులు, వలస కార్మికులు వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వారి విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది’ అని వివరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top