బీజేపీలో చేరిన హదియా తండ్రి

Kerala Women Hadiya Father Joins BJP - Sakshi

తిరువనంతపురం : ఇస్లాం మతం స్వీకరించి.. ఆ తర్వాత ముస్లిం యువకుడిని వివాహం చేసుకుని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళకు చెందిన వైద్య విద్యార్థిని హదియా తండ్రి కేఎమ్‌ అశోకన్‌ సోమవారం బీజేపీలో చేరారు. పార్టీ కార్యదర్శి బి.గోపాలకృష్ణన్‌ సమక్షంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అశోకన్‌ మీడియాతో మాట్లాడారు. ‘ చిన్ననాటి నుంచి నేను కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను నమ్ముతున్నాను. కానీ ఇటీవలి కాలంలో మైనార్టీ ఓట్ల కోసం ఆ పార్టీ దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. ఎవరైనా ఒక వ్యక్తి హిందువుల గురించి మాట్లాడుతున్నాడు అంటే అతడిని ఎందుకు ఓ తీవ్రవాదిగా ముద్ర వేస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారు.

నమ్మకానికి, చట్టానికి మధ్య నలిగిపోతున్నాం..
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అందరు హిందువుల్లాగే తాను కూడా చట్టానికి, నమ్మకానికి మధ్య నలిగిపోతున్నాని అశోకన్‌ అన్నారు. నిజానికి మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలను చట్టం పరిధి నుంచి తప్పిస్తేనే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని.. అయితే శబరిమల అంశంలో బీజేపీ అనుసరించే ఏ విధానాలనైనా తాను సమర్థిస్తానని పేర్కొన్నారు. ఈ విషయంపై మేధావులు కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

కాగా కేరళకు చెందిన అఖిల ఆశోకన్‌(25) అనే యువతి 2016 డిసెంబర్‌లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్‌ జహాన్‌ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అఖిల తండ్రి అశోకన్‌ మాత్రం తన కూతురుని బలవంతంగా మతం మార్పించి, షఫీన్‌ పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ‘లవ్ జిహాద్ కేసు’ గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అటుపై కేరళ హైకోర్టు వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పునివ్వడంతో హదియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో హదియా- షఫీన్‌ల వివాహం చట్టబద్ధమైనదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top