కేరళ పర్యాటకశాఖ మంత్రికి కేంద్రం షాక్
చైనాలో నిర్వహించబోయే ప్రతిష్టాత్మక సదస్సుకు టూరిజంశాఖ మంత్రికి విదేశాగంగ శాఖ...
సాక్షి, త్రివేండ్రం: కేంద్ర ప్రభుత్వంపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళ టూరిజం మంత్రి విషయంలో విదేశాంగ శాఖ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో ఈ నెల 11 నుంచి 16 తేదీల మధ్య గ్లోబల్ టూరిజం సదస్సు నిర్వహిస్తున్నారు. కేరళ టూరిజం శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌కు సదస్సుకు రావాలంటూ ఆహ్వానం అందింది. అయితే విదేశాంగ శాఖ మాత్రం మంత్రి సురేంద్రన్‌కు అనుమతి నిరాకరించింది. దీనిపై ఆయన కేంద్రానికి లేఖ రాయగా, దానికి బదులు కూడా ఇవ్వలేదంట. ‘ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయమన్న విషయం స్పష్టమౌతోంది. కనీసం కారణాలు కూడా వివరించలేదు’ అని సురేంద్రన్ తెలిపారు. ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.
అయితే విదేశాంగ శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. పలు కోణాల్లో పరిశీలించాకే మంత్రి సురేంద్రన్‌కు అనుమతి నిరాకరించామని స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్విట్టర్‌లో స్పందించారు. ఇదో దురదృష్టకరమైన ఘటన అని, కేంద్రం నిర్ణయంతో రాష్ట్రం షాక్‌కి గురైందని, కేంద్ర పక్షపాత ధోరణిపై తాము నిరసన తెలిపి తీరతామని ట్విట్టర్‌లో విజయన్ తెలిపారు.