మద్యం సేవించేందుకు వయోపరిమితి | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 7 2017 5:35 PM

Kerala Government increase Drinking Age Bar - Sakshi

తిరువనంతపురం : మద్యం సేవించేందుకు వయోపరిమితిని పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది కూడా. మద్యం సేవించే యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

అయితే ఈ నిర్ణయంతో ఏం ఒరగకపోవచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాగా, 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రయత్నించగా.. అది కుదరలేదు. దీంతో కేవలం ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు మాత్రమే లైసెన్సులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవటంతో వందలాది పబ్‌లు, బార్లు మూతపడ్డాయి. ఉద్యమకారులు ఆ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ పబ్‌, బార్‌ యజమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతేగాక పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. 

ఇక ఇప్పుడు ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరుగా మళ్లీ లైసెన్సులు జారీ చేయటం ప్రారంభించింది. అందులో భాగంగా ముందుగా త్రీస్టార్‌హోటళ్లతోపాటు రిసార్ట్స్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే యువతను కట్టడి చేసేందుకు మాత్రం వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష  కాంగ్రెస్‌ ఓ జిమిక్కుగా అభివర్ణిస్తోంది. మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కి.. కంటి తుడుపు చర్యగా వయో పరిమితిని పెంచిందని విమర్శిస్తోంది. 

Advertisement
Advertisement