ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..

Jitendra Singh Says Rohingya Do Not Belong To 6 Minorities Of CAA - Sakshi

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

శ్రీనగర్‌: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రకారం రోహింగ్యాలకు భారత పౌరసత్వం వచ్చే వీలు లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. త్వరలోనే వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వ అధికారుల శిక్షణా కార్యక్రమానికి జితేంద్ర సింగ్‌ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చిన నాటి నుంచే జమ్మూ కశ్మీర్‌లో అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. నూతన చట్టం ప్రకారం రోహింగ్యాలకు భారత్‌లో ఉండేందుకు ఎటువంటి మినహాయింపులు ఉండవని తెలిపారు.

‘రోహింగ్యాలను ఎలా పంపించాలో కేంద్రం ఆలోచిస్తోంది. జాబితాలు తయారు చేస్తున్నాం. అవసరమైన చోట్ల బయోమెట్రిక్‌ గుర్తింంపు కార్డులు అందజేస్తాం. ఎందుకంటే సీఏఏ ప్రకారం రోహింగ్యాలు భారత్‌లో ఉండే అవకాశం లేదు. చట్టంలో పేర్కొన్న ఆరు మైనార్టీలో వీరి ప్రస్తావన లేదు. అంతేకాదు వీరు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లేదా ఆఫ్గనిస్తాన్‌ నుంచి వచ్చిన వాళ్లు కాదు. మయన్మార్‌ నుంచి వచ్చిన వాళ్లు గనుక వారు అక్కడికే వెళ్లిపోవాలి. అంతేకాదు వాళ్లు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌ను దాటుకుని జమ్మూ కశ్మీర్‌ వరకు ఎలా రాగలిగారన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నాం’ అని జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.(ఎవరూ తప్పించుకోలేరు: కేంద్ర మంత్రి)

కాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం జమ్మూ, సాంబా జిల్లాల్లో దాదాపు 13,700 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో రోహింగ్యాలతో పాటు పలువురు బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు. 2008 నుంచి 2016 మధ్య వీరి జనాభా ఆరు వేలకు పైగా పెరిగింది. ఇక డిసెంబరు 31, 2014 తర్వాత ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ లేదా పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సీఏఏ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఓ వర్గం ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.(అసలేంటి ఇదంతా.. నాకేం అర్థం కావట్లేదు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top