'ఐటీ రంగం అభివృద్ధి రహస్యమిదే' | IT sector thrived because the government did not govern it, Finance Minister Arun Jaitley | Sakshi
Sakshi News home page

'ఐటీ రంగం అభివృద్ధి రహస్యమిదే'

Jan 16 2016 11:27 AM | Updated on Sep 3 2017 3:45 PM

'ఐటీ రంగం అభివృద్ధి రహస్యమిదే'

'ఐటీ రంగం అభివృద్ధి రహస్యమిదే'

ఐటీ రంగం అభివృద్ధి వెనక దాగున్న రహస్యం గుట్టువిప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..

న్యూఢిల్లీ: ఓ వైపు ఖాయిలాపడే పరిశ్రమలు, నష్టాలబాటలో నడిచే కర్మాగారాల సంఖ్య పెరిగిపోతుండగా, ఐటీ రంగం మాత్రం విప్లవాత్మక మార్పులతో దూసుకెళ్లటం చూస్తున్నాం. ఇంతటి అభివృద్ధి వెనక దాగున్న రహస్యం గుట్టువిప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన స్టార్ట్-అప్ ఇండియాను లాంచ్ చేసిన ఆయన పలు అంశాలపై కూలంకషంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేటి సాయంత్రం అధికారికంగా ప్రారంభించనున్నారు.

'గతంలో ఒక పరిశ్రమను స్థాపించాలంటే ఎన్నో అడ్డంకులు. 'లైసెన్స్ రాజ్' విధానంతో పారిశ్రామికవేత్తలకు ఎన్నో ఇబ్బందులు. కాలక్రమంలో ఇండియా ఆ విధానానికి తిలోదకాలిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. అందుకు 'స్టార్ట్-అప్ ఇండియా' వేదికగా నిలుస్తుంది. మన దేశంలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పారిశ్రామిక విధానం. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించాం. అందుకే విధాన నిర్ణయాల్లో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించాలనుకుంటున్నాం' అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

ప్రభుత్వ అజమాయిషీ ఎంత తగ్గితే సంస్థలు అంతగా వృద్ధిలోకి వస్తాయన్న జైట్లీ.. ఆది నుంచీ ప్రభుత్వ పర్యవేక్షణలో లేనందునే ఐటీ రంగం అద్భుత పురోగతిని సాధించిందన్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నీ మందగమనంలో ఉన్నవేళ అందుకు విరుద్ధంగా భారత్ వృద్ధిబాటలో పయనిస్తున్నదని, ఆ మేరకు యువత అవకాశాలు అందివ్వటమే 'స్టార్ట్-అప్ ఇండియా' ప్రధాన ఉద్దేశ్యమని జైట్లీ ఉద్ఘాటించారు.

Advertisement
 
Advertisement
Advertisement