ఈ ఏడాది చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇది
2025–26లో ఐటీ ఎగుమతులు రూ.3.6 లక్షల కోట్లు
520కి చేరనున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల సంఖ్య
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ అంచనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్ పేరు చెప్పగానే తొలుత గుర్తొచ్చేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. వందలాది అంతర్జాతీ య దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2025 మార్చి నాటికి ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 9.39 లక్షల మంది పనిచేస్తున్నారు.
గత ఏడాది చివరినాటికి ఈ సంఖ్య 10.2 లక్షలకు చేరినట్టు అంచనా. కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) రాష్ట్రంలో కొత్తగా అడుగుపెట్టడం, అలాగే ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థల విస్తరణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఈ ఏడాది డిసెంబరుకల్లా ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య 11 లక్షల మార్కును చేరుకుంటుందని తెలంగాణ ఐటీ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జీసీసీల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 3 లక్షల స్థాయికి చేరిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
16.6 శాతం వార్షిక వృద్ధితో..
రాష్ట్రం నుంచి 2024–25లో రూ.3.13 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయి. కాగా 16.6 శాతం వార్షిక వృద్ధితో 2025–26లో ఇది రూ.3.6 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘వేగం, పారదర్శకత’అనే నినాదంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తీసుకొచ్చిన సరికొత్త పరిపాలనా సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, ఐటీ వ్య యాల ఒడిదుడుకులను తట్టుకుని ఎగుమతుల వృద్ధి స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఈ యూ, ఏషియా పసిఫిక్ మార్కెట్లలోకి వ్యూహాత్మ కంగా ఎగుమతులు విస్తరించాయని వివరించారు.
మూడేళ్లలో కొత్తగా 160 కేంద్రాలు..
రాష్ట్రంలో 2023 నాటికి 360 జీసీసీలు కొలువుదీరాయి. దేశంలోని మొత్తం జీసీసీల్లో రాష్ట్ర వాటా 20 శాతంగా ఉందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. జీసీసీల స్థాపనకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, ఇక్కడి మానవ వనరులు, మెరుగైన మౌలిక వసతులతో ఈ ఏడాది మరో 80 సెంటర్లు తోడవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బెంగళూరు, ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో అద్దెలు 25–30 శాతం తక్కువ కావడం కంపెనీలకు కలిసి వచ్చే అంశమని చెబుతోంది.


