నేటి వేగవంతమైన ఐటీ రంగంలో ఉద్యోగ మార్పు అనేది సర్వసాధారణం. అయితే, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన కెరీర్ విషయంలో ఎదుర్కొన్న సందిగ్ధత ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది. కొత్త ఉద్యోగ ఆఫర్ ఒకవైపు, ప్రస్తుత సంస్థ ఇస్తున్న స్ప్లిట్ కౌంటర్ ఆఫర్ మరోవైపు.. ఈ మధ్య ఏది ఎంచుకోవాలో తెలియక ఒక మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పంచుకున్న అనుభవం అనేక మంది ఐటీ నిపుణుల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది.
ఏమిటీ సమస్య?
భారతదేశంలోని ఒక ప్రముఖ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మిడ్-లెవల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సదరు ఉద్యోగికి కుటుంబ బాధ్యతలు పెరగడంతో వేతన పెంపు అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో వేరే కంపెనీలో ప్రయత్నించగా తన ప్రస్తుత వేతనం కంటే సుమారు 1.5 రెట్లు ఎక్కువ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. దీంతో ఆయన తన ప్రస్తుత కంపెనీకి రాజీనామా సమర్పించారు.
అయితే, ఆయనను వదులుకోవడానికి ఇష్టపడని ప్రస్తుత యాజమాన్యం బయటి ఆఫర్‌తో సమానమైన వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ, ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఆ పెంపును ఒకేసారి కాకుండా కొంత భాగాన్ని వెంటనే, మిగిలిన భాగాన్ని కొన్ని నెలల తర్వాత ఇస్తామని (స్ప్లిట్ ఆఫర్) యాజమాన్యం ప్రతిపాదించింది. దీనిని డాక్యుమెంట్ చేస్తామని హామీ ఇచ్చినా ఈ పరిస్థితి ఆయనను గందరగోళానికి గురిచేసింది.
నెటిజన్ల భిన్న అభిప్రాయాలు
ఈ అనుభవాన్ని ‘బయటి ఆఫర్ లేదా కౌంటర్ ఆఫర్.. ఏది ఎంచుకోవాలి’ అనే శీర్షికతో సదరు ఇంజినీర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారిలో మెజారిటీ వర్గం మాత్రం ‘కౌంటర్ ఆఫర్‌ను అంగీకరించకుండా, కొత్త సంస్థకే వెళ్లడం ఉత్తమం’ అని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!
నెటిజన్లు లేవనెత్తిన అంశాలు
ఒకసారి మీరు రాజీనామా చేశారంటే మీరు సంస్థను వదిలి వెళ్లడానికి సిద్ధపడ్డారని యాజమాన్యానికి స్పష్టమవుతుంది. భవిష్యత్తులో కంపెనీలో ఏవైనా లే-ఆఫ్స్ (ఉద్యోగ తొలగింపులు) జరిగితే ముందుగా టార్గెట్ అయ్యే అవకాశం మీకే ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.
కంపెనీలు వాగ్దానం చేసినట్లుగా కొన్ని నెలల తర్వాత రెండో విడత పెంపును ఇస్తాయనే దానికి ఎటువంటి గ్యారెంటీ ఉండదు. వ్యాపార పరిస్థితులు మారితే ఆ వాగ్దానాలు పాటించరని అనుభవజ్ఞులు గుర్తు చేస్తున్నారు.
ఒక కొత్త సంస్థలో చేరడం వల్ల కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడమే కాకుండా మీ మార్కెట్ విలువ పెరుగుతుందని, అదే పాత సంస్థలో ఉండటం వల్ల కెరీర్ ఎదుగుదల మందగించవచ్చని మరికొందరు సూచిస్తున్నారు. కెరీర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం జీతం మాత్రమే కాకుండా పని సంస్కృతి, భవిష్యత్తు అవకాశాలు, మానసిక ప్రశాంతతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.


