
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (51) అత్యంత అరుదైన న్యూరోఎండోక్రైన్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స కోసం తాను విదేశాల్లో ఉన్నానని ఇర్ఫాన్ చెప్పారు. కేన్సర్‌ను తట్టుకోవడం చాలా కష్టంగా ఉందనీ, కానీ తన చుట్టూ ఉన్నవారు వ్యాధితో పోరాడటానికి అవసరమైన మద్దతును తనకు ఇచ్చి ఆశలు నింపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
మార్గరెట్ మిచెల్ రాసిన ‘గాన్ విత్ ద విండ్’ పుస్తకంలోని ‘మనం ఏది కోరుకుంటే అది ప్రసాదించాల్సిన బాధ్యత జీవితానికి లేదు’ అన్న మాటలతో ఆయన తన మీడియా ప్రకటనను ప్రారంభించారు. అభిమానులు తమ దీవెనలను పంపుతూనే ఉండాలని ఇర్ఫాన్ ఖాన్ కోరారు. న్యూరోఎండోక్రైన్ కేన్సర్ కణతులు ఊపిరితిత్తులు, జీర్ణాశయం సహా శరీరంలోని ఏ భాగంలోనైనా మొదలవుతాయి. ఎక్కువగా పేగుల్లో ఇవి ఏర్పడతాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర భాగాలకు విస్తరిస్తాయి. హార్మోన్లను ఉత్పత్తి చేసే నాడీ కణాలపై క్రమరహితంగా కణతులు పెరగడమే ఈ కేన్సర్. ఇది అత్యంత అరుదైన కేన్సర్ రకం. ఈ కేన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చు.