
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి గత జనవరి నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎండీగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ముగ్గురు ఎండీలలో ఆయన ఒకరు. చిత్తూరు జిల్లా పొట్లపాడుకు చెందిన ఆయన 12 ఏళ్ల వయసులోనే తండ్రి పచారీ కొట్టుకు సంబంధించి రైతులు తీసుకున్న అప్పులు వసూలు చేయటానికి ఊరురా తిరిగేవారు. సోదరుడితో కలిసి ఒక్కో ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేసేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత కూడా ఆయన అప్పులు వసూలు చేసే పనిలోనే ఉన్నారు. కానీ, పెద్ద సంస్థకు సంబంధించి.. పెద్ద మొత్తంలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన దాదాపు 19.6 బిలియన్ డాలర్ల మొండి బకాయిలను రికవరీ చేయటం కూడా ఆయన పనిలో భాగమే. చిన్నప్పుడు డబ్బులు వసూలు చేసిన అనుభవం ఎంతో నేర్పిందని శెట్టి అంటున్నారు. ( ఎస్‌బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి)
ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రంగంలో సమయ పాలన ప్రధానం. మనం ఎంత తొందరగా డబ్బులు రికవరీ చేస్తున్నామన్నదే ముఖ్యం. కంపెనీల నుంచి అప్పు వసూలు చేయటానికి నిర్ణయాలు తీసుకోవటం చాలా కష్టం. పరిస్థితులను బట్టి ముందుకు సాగిపోవాలి. నా చిన్నతనంలో రైతులు మా తండ్రి వద్ద తీసుకున్న అప్పులు వసూలు చేయటానికి నా సోదరుడితో కలిసి వెళ్లేవాడిని. వారు పొలాలకు వెళ్లే సమయంలో ఇంటి బయట నిలబడేవాళ్లం. వాళ్లు పొలాలకు వెళ్లాలంటే మాకు డబ్బు ఇవాల్సి వచ్చేది. నా సోదరుడి కంటే నేను ఎక్కువ మొత్తం వసూలు చేసేవాడిని. ఆ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడుతోంది’’ అని అన్నారు.